అమీర్‌పేటలో ఎస్ఆర్నగర్ బస్‌స్టాప్ వెనుక ఓ భవనానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి డిస్కం అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ఆ భవనానికి యూజీ కేబుల్ ద్వారా కనెక్షన్ ఇవ్వాలని చెప్పినప్పటికీ అక్కడ ఆ అవకాశం లేదు. కారణం ఆ రోడ్డులో డ్రైనేజీ, వాటర్ పైపులు ఉండడం వల్ల ఎక్కడి నుంచి కేబుల్ వేయాలో తెలియక ఓవర్హెడ్లో వేసుకుంటామని వినియోగదారుడు అడిగితే అవకాశం లేదంటూ అతడి కనెక్షన్‌ను నిలిపివేశారు.
– సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ)
ప్రస్తుతం యూజీ వేయలేక, ఓవర్‌హెడ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 42లో ఉంది. సీఎం ఇంటి వెనుక ఉన్న ప్రాంతంలో ఒక ఇంటి నిర్మాణం జరుగుతుండగా అక్కడ యూజీ లైన్ వేయడానికి రోడ్డు ఉన్నప్పటికీ కొండ ప్రాంతం కావడంతో యూజీ కేబుల్ వేయాలంటే చాలా కష్టమంటూ కాంట్రాక్టర్లు చెబుతున్నారని వినియోగదారులు చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో చాలా చోట్ల కొత్త కనెక్షన్ల విషయంలో యూజీ కేబుల్ వ్యవహారం అడ్డంకిగా మారింది. దీంతో హైదరాబాద్‌లో కొత్త విద్యుత్ కనెక్షన్లకు బ్రేక్ పడిందా అంటే అవునంటున్నారు వినియోగదారులు. టీజీఎస్పీడీసీఎల్కు తాము దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కేవలం కేటగిరీ 8కిందే కనెక్షన్ కొనసాగుతుంది తప్ప కేటగిరీ 1 కానీ 2 కి కానీ మార్చడం లేదని చెప్పారు. ఇంతకూ ఈ పరిస్థితి రావడానికి కారణం అందరూ అనుకున్నట్లుగా కేవలం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు మాత్రమే కాదు..
అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాలంటూ ఇచ్చిన జీఓ కారణంగా నగరంలో ఎక్కడా కొత్త కనెక్షన్లకు అవకాశం దక్కడం లేదు. ఒకవేళ ఎక్కడైనా కొత్తగా కనెక్షన్లు ఇచ్చినా వాటికి సంబంధించి అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌హెడ్ కేబుల్ వేయకూడదంటూ గత సంవత్సరం చివరలో ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి నేటివరకు కేవలం అండర్ గ్రౌండ్ వేయడానికి అవకాశం ఉన్న చోట తప్ప మిగతాచోట్ల ఎక్కడా కొత్త కనెక్షన్లకు కనెక్టివిటీ ఇవ్వలేదని వినియోగదారులు చెబుతున్నారు. ఏడెనిమిది నెలలుగా నగరంలో కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి అవకాశం లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు, వినియోగదారులు లబోదిబోమంటున్నారు. తెలంగాణ కేబినెట్ జీహెచ్ంఎసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలంటూ గత సంవత్సరం నవంబర్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ పరిధిలో అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటించారు. కానీ యూజీ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు క్షేత్రస్థాయిలో సాధ్యపడుతుందా అందునా నగరంలోని సౌత్, సెంట్రల్, బంజారాహిల్స్, హబ్సిగూడ తదితర సర్కిళ్లలో అండర్‌గ్రౌండ్ కేబుల్ ఎలా వేస్తారనే దానిపై ప్రభుత్వశాఖలు కసరత్తు చేయలేదని విద్యుత్ అధికారులే చెబుతున్నారు.
అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాలనుకునే నిర్ణ యం స్వాగతించదగినదే అయినా క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలపై సమీక్ష జరపాల్సిన ప్రభుత్వం ప్రత్యేకించి టీజీఎస్పీడీసీఎల్ అసలు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. కేబినెట్ నిర్ణయం వెలువడగానే ఎస్పీడీసీఎల్ నుంచి యూజీ కేబుల్ తప్ప ఓహెచ్ వేయొద్దంటూ ఉత్తర్వులు రావడంతో నగరంలో కొత్త విద్యుత్ కనెక్షన్లకు బ్రేక్ పడింది. నగరం మధ్యలో అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాలంటే చాలా కష్టమని అధికారులే చెబుతున్నారు. ఇప్పటివరకు సమ్మర్‌యాక్షన్ ప్లాన్‌లో యూజీ కేబుల్ విషయంలో చేపట్టిన పనులే మొదలుపెట్టని పరిస్థితి ఉండగా కొన్ని చోట్ల ఓవర్‌హెడ్ లైన్లు వేసి సరిపెట్టుకున్నారు.
ఇక గృహ కనెక్షన్లకు సంబంధించి గ్రేటర్ పరిధిలో 57లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా పాతబస్తీతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలంలో శిథిలావస్థకు చేరినవే ఉన్నాయి. ప్రధానంగా యూజీ కేబుల్ వేయాలంటే జీహెచ్ఎంసీకి , జలమండలికి,ఎస్పీడీసీఎల్కు మధ్య సమన్వయం ఉండా లి. తాము కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే సందర్భంలో రోడ్డు తవ్వకాలు చేపట్టాలి కాబట్టి అక్కడ అప్పటికే ఉన్న పైపులు దెబ్బతినకుండా కావలసిన వ్యవహారం మొత్తం దక్షిణ డిస్కమే చూసుకోవాలి. కానీ ఆ బాధ్యత వినియోగదారులపై పెట్టి మీరేం చేసుకున్నా సరే.. యూజీ కేబుల్ వేస్తేనే కనెక్షన్ ఇస్తామంటూ చెప్పడంతో వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు యూజీ ఎలా వేయాలో తమకు తెలియడం లేదని, తాము జీహెచ్ఎంసీకి వెళ్తే తమకు ఎస్పీడీసీఎల్ నుంచి ఎలాంటి లెటర్ రాలేదని, తాము రోడ్డు తవ్వడానికి అనుమతి ఇచ్చేది లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారని వినియోగదారులు చెప్పారు.
నగర శివారులో అండర్‌గ్రౌండ్ కేబుల్ వేసి కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి అవకాశముంటుంది కానీ నగరం మధ్యలో ఏదైనా భవననిర్మాణం జరిగి అక్కడ కొత్తగా కనెక్షన్ తీసుకోవాలంటే మాత్రం పూర్తిగా యూజీ కేబుల్ వ్యవహారం అడ్డువస్తున్నది. ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడాల్సిన డిస్కం ఉన్నతాధికారులు ఆ దిశగా పట్టించుకోవడం లేదు. వినియోగదారులే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి తప్ప తమకు సంబంధమే లేదనడంతో సమస్య పరిష్కారమయ్యేది ఎలాగో తెలియక వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ వ్యవహారమంతా పాత సీఎండీ ముషారఫ్ హయాంలో జరిగినప్పటికీ ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలించకుండానే ఉత్తర్వులు జారీ చేయడంతో నెలల తరబడి కనెక్షన్ల కోసం నగరవాసులు ఎదురుచూడాల్సి వస్తోంది.
ప్రస్తుత సీఎండీ జితేశ్ పాటిల్ వచ్చిన తర్వాత కొందరు కాంట్రాక్టర్లు, వినియోగదారులు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో యూజీ కేబుల్ వ్యవస్థ ఎలా చేయాలనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సీఎండీ స్వయంగా మున్సిపల్ కార్పొరేషన్‌కు , జలమండలి అధికారులకు లేఖ రాసి విద్యుత్ కనెక్షన్లకు అవసరమైన లైన్లను అండర్‌గ్రౌండ్‌లో వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరితే సమస్య పరిష్కారమవుతుందని డిస్కంలో ఓ సీనియర్ విద్యుత్ అధికారి చెప్పారు. ఒకవేళ తామేదైనా వేసుకోవాలని చెప్పినా విజిలెన్స్ తనిఖీల సందర్భంలో ఇబ్బందులు వచ్చే అవకాశముందని దీనిపై సీఎండీ ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప కొత్త కనెక్షన్లకు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీకి, జలమండలికి రోడ్డు కటింగ్‌కు సంబంధించిన కొంత రుసుము చెల్లిస్తే వారు అనుమతిస్తారని అయితే ఈ రుసుము కూడా కనెక్షన్ చార్జిలలోనే వసూలు చేసి ఆ మొత్తాన్ని జీహెచ్ఎంసీకి దక్షిణ డిస్కం చెల్లించేలా ఒక ఒప్పందం కుదిరితే నగరంలో కొత్త విద్యుత్ కనెక్షన్ల సమస్య తీరుతుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.