కళ్లుతెరిచిన వెంటనే చేతిలోకి మొబైల్ తీసుకోవడం ఇప్పుడు చాలామందికి తెలియకుండానే దినచర్యలో భాగమైపోయింది. సందేశాలు, సామాజిక మాధ్యమాలు, వార్తలు… ఇలా మెదడు పూర్తిగా మేలొనక ముందే సమాచార ప్రవాహంలోకి వెళ్లిపోతున్నాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి నిపుణులు ‘స్రీన్-ఫ్రీ మార్నింగ్’ అనే కొత్త పద్ధతిని ప్రోత్సహిస్తున్నారు. అంటే నిద్రలేచిన తర్వాత తొలి అరగంట నుంచి గంటపాటు ఎలాంటి డిజిటల్ పరికరాన్నీ ఉపయోగించకుండా గడపడం.
ఈ సమయంలో కొందరు కిటికీ దగ్గర కూర్చుని వేడి టీని ఆస్వాదిస్తారు. మరికొందరు మొకలకు నీళ్లు పోస్తారు. కొందరు డైరీలో ఆ రోజు చేయాల్సిన పనులు రాసుకుంటారు. ఇంకొందరు తేలికపాటి వ్యాయామం, యోగా లేదా పుస్తక పఠనంతో రోజును ప్రారంభిస్తారు. ఇలా తొలి గంటను ప్రశాంతంగా గడపడం మనసును రోజంతా సమతులంగా ఉంచేందుకు దోహదపడుతుందట. ఈ పద్ధతిని అనుసరించే వాళ్లు మరికొన్ని చిన్న మార్పులు కూడా చేస్తున్నారు. పడుకునే సమయంలో మొబైల్‌ను మంచం పకన కాకుండా కొద్దిదూరంలో ఉంచడం, అలారం కోసం సాధారణ గడియారాన్ని ఉపయోగించడం, నిద్రలేచిన వెంటనే సామాజిక మాధ్యమాలను తెరవకుండా కుటుంబసభ్యులతో లేదా తమతో తాము కొద్దిసేపు గడపడం లాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇదేం డిజిటల్ ప్రపంచానికి దూరంగా పారిపోవడం కాదు… రోజులో అత్యంత విలువైన తొలి క్షణాలను మనకోసం దాచుకోవడం. ఒకసారి ఉదయాన్ని ప్రశాంతంగా ఆరంభిస్తే, ఆ ప్రభావం మిగతా పనులపైనా కనిపిస్తుందని ఈ విధానాన్ని అనుసరించే వాళ్లు చెబుతున్నారు. మరి మీరూ ప్రయత్నిస్తారా.. ప్రశాంతమైన ఉదయాన్ని సొంతం చేసుకోవడానికి..!