అంబర్‌పేట, అక్టోబర్ 16: అంబర్‌పేట్‌లో దంపతులను హత్య చేసిన కేసు మిస్టరీ ఏడాది గడిచిన ఇంకా వీడలేదు. గతేడాది ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. విషయం బయటకు వచ్చే వరకు ఇంట్లో మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కన్పించాయి. ఈ కేసులో ఏడాదిగా పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసినా ఎలాంటి పురోగతి లేదు. ఇది హైదరాబాద్ పోలీసులకు సవాల్‌గా మారింది. మొదట్లో హడావిడి చేసిన పోలీసులు కొన్ని రోజుల తరువాత ఈ కేసును పక్కన పెట్టేశారనే విమర్శలు ఉన్నాయి.
ఈ కేసులో మృతులకు సంబంధించిన ఓ పెద్దస్థాయి అధికారి పాత్ర ఉందనే అనుమానాలు సైతం గతంలో వ్యక్తమయ్యాయి, అయినా ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కన్పించలేదు. ఈ కేసు ఇంకా దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నా.. అది కేవలం మాటల వరకే పరిమితమయ్యిందనే చర్చ జరుగుతుంది. నిజామాబాద్ పోచంపాడుకు చెందిన పొద్దుటూరు లింగారెడ్డి ఊర్మిళాదేవి దంపతులు కొన్నేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి బాగ్‌అంబర్‌పేట సాయిబాబానగర్ కాలనీలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకొని నివాసమున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేసిన లింగారెడ్డి పదవీ విరమణ పొందారు. ఒంటరిగా ఉంటున్న దంపతులిద్దరిని టార్గెట్ చేసిన గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి లింగారెడ్డి, ఊర్మిళదేవి తలపై రాడ్లతో కొట్టి కిరాతకంగా హత్య చేశారు.
ఈ ఘటన గతేడాది అక్టోబర్ 17న జరగగా..19వ తేదీన విషయం బయటకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య కేసును ఛేదించాలని పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్, అంబర్‌పేట పీఎస్ క్రైమ్ టీమ్, డీసీపీ టీమ్‌లతో పాటు వేరే జోన్ల టాస్క్‌ఫోర్స్ బృందాలు కూడా ఈ కేసు ఛేదనలో పని చేశాయి. కానీ ఫలితం కనిపించలేదు. మృతులకు సంబంధించిన బంధువులలో ఎవరితోనైనా విభేదాలున్నాయా? అనే కోణంలోను కొందరిని విచారణ చేశారు. ఏ కోణంలో కూడా కనీసం క్లూ దొరకలేదు. అయితే సీసీ కెమెరాలలో ఆధారాలు లభించకపోవడంతోనే ఈ కేసు మిస్టరీ వీడడం లేదని కొందరు పోలీసులు మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ పోలీసులు ఎన్నో సమస్యాతమ్మకమైన కేసులను ఛేదించిన చరిత్ర ఉంది. అలాంటిది వృద్ధ దంపతుల హత్య కేసును ఎందుకు ఛేదించకలేక పోతున్నారని హైదరాబాద్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.