చార్మినార్, ఎప్రిల్ 23: ఠారెతిస్తున్న ఎండలతో జనాలతోపాటు జంతుజాలం సైతం బెంబేలెతుత్తున్నాయి. మండు వేసవిలో మూగజీవాల సంరక్షణ, వాటిని ఉల్లాసపరిచేందుకు జూపార్క్ సిబ్బంది వాటికి ప్రత్యేక సపర్యలు చేస్తున్నారు. జంతువుల ఎన్క్లోజర్లు శీతలంగా ఉండేందుకు సిబ్బంది ఎప్పటికప్పుడు పై కప్పులపై నీటిని చిమ్ముతూ వాటికి ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాయల్ బెంగాల్ టైగర్ ఎన్క్లోజర్తోపాటు ఇతర జంతువుల ఎన్క్లోజర్లలోనూ ప్రత్యేకంగా కూలర్లను అమర్చారు. వాటితోపాటు ఎన్‌క్లోజర్ భాహ్యప్రాంతాల్లో నీటి తుంపర్లు విరజిమ్మే ఏర్పాట్లు చేశారు. కొన్ని జంతువులకు వేసవి తాపాన్ని తీర్చడానికి కొన్ని ప్రత్యేక పానీయాలను అందిస్తున్నామని జూ అధికారులు తెలిపారు. ఎండవేడిమి నుంచి జంతువులకు ఉపశమనం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామనిత తెలిపారు.

