Kodangal Farmers | ఖైరతాబాద్, డిసెంబర్ 21 : ఏండ్ల తరబడి సాగు చేసుకుంటూ.. దానిపైనే తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి తమ భూములను గుంజుకొని తమపైనే దౌర్జన్యాలు చేస్తున్నాయని కొండకల్, వెలమల గ్రామాల గిరిజన రైతులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాంబాల్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాంనాయక్తో కలిసి గిరిజన రైతులు మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో సర్వే నంబర్లు 362, 363, 364, 377లలో సుమారు 80 ఎకరాలతో పాటు మరో సర్వే నంబర్లోని 217 ఎకరాల మిర్సాబ్కుంట, వల్లభస్వామి కుంట, పీటీ తదితర భూములను గత దశాబ్దాల కాలంగా గిరిజన రైతులు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలమల గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న సుమారు 160 ఎకరాలను 120 కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ రెండు గ్రామాల మధ్య సుమారు 73 ఎకరాల బీళా దాఖల భూమి సైతం ఉన్నదని, అపర్ణ, గ్రీన్ మార్క్ నిర్మాణ సంస్థలు ఆయా భూములను ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నాయని గిరిజన రైతులు ఆరోపించారు.
ప్రభుత్వం న్యాయం చేయాలంటూ డిమాండ్
కొండకల్‌లోని 217 ఎకరాలను సీలింగ్ చట్టంలో భాగంగా 1973 ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్నారు. ఈ భూమిని సైతం గత యజమాని వ్యవసాయ యోగ్యం కాని భూమిగా తప్పుడు పత్రాలు సృష్టించి.. తన ఆధీనంలో ఉన్నట్లు చెబుతూ సదరు రెండు నిర్మాణ సంస్థలకు తమకు తెలియకుండానే విక్రయించాడన్నారు. ప్రస్తుతం గిరిజనులు వ్యవసాయ చేసుకుంటున్న భూములకు సంబంధించిన పట్టాలు, ఇతర పత్రాలు ఉన్నాయని, కానీ ఆయా నిర్మాణ సంస్థల యజమానులు బలవంతంగా తమ భూములను స్వాధీనం చేసుకొని తమపైనే దౌర్జన్యాలు చేస్తున్నారని గిరిజన రైతులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
గిరిజన రైతులు జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా, వెంటనే విచారణ చేపట్టాలని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించిందన్నారు. ప్రభుత్వం స్పందించి తమ భూములు తమకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, చందర్ నాయక్, శంకర్ నాయక్, రవినాయక్, రాజు, లక్ష్మణ్ నాయక్, సేవ్యా నాయక్, కీర్యా నాయక్, లక్ష్మి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.