సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్లో పెద్ద తలకాయలే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసును నీరుగార్చేందుకు కొన్ని అదృశ్య శక్తులు సర్వప్రయత్నాలు చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటకు వచ్చి మూడు రోజులు గడిచినా.. ఈ కేసులో పురోగతి లేకపోవడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
నగరంలో పలు చోట్ల అలకనంద మూలాలు?
సాధారణంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయాలంటే సర్జరీకి ముందు వైద్యపరీక్షలు, ఇతరాత్ర పలు రకాల ప్రక్రియలు ఉంటాయి. అయితే కిడ్నీ మార్పిడికి అసవరమైన ప్రక్రియ మొత్తం 9పడకల సామర్ధ్యం ఉన్న చిన్నపాటి దవాఖానలో సాధ్యం కాదంటున్నారు నిపుణులు. దీని కిడ్నీ మార్పిడికి సంబంధించిన వైద్యపరీక్షలు, ఇతర ప్రక్రియ మొత్తం నగరంలోని మరో చోట జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని ఆధారంగా అలకనంద మూలాలు నగరంలోని పలు చోట్ల ఉన్నట్లు విచారణాధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం.
తాళం వేసి విచారణకు ఆదేశించడమేంటి?
కిడ్నీ రాకెట్‌పై వైద్య, ఆరోగ్యశాఖ విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జరిగిన వ్యవహారంపై విచారణ జరపాలంటే ముందుగా శస్త్రచికిత్సలు జరిగిన దవాఖాన, అక్కడున్న వసతులు, ఆపరేషన్ థియేటర్ తదితర కీలకమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ కిడ్నీ మార్పిడీలు జరిగిన దవాఖానకు తాళం వేసి, గేటు బయట నుంచే విచారణ చేయించడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇదిలా ఉండగా, దర్యాప్తు కమిటీ పలు అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది.