అమీర్‌పేట్, ఫిబ్రవరి 20 : ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలలో తాము నేర్చుకున్న అంశాలను తరగతి గది బయట బృందాలుగా చేరి సమిష్టిగా రూపొందించిన ఆల్-టెర్రైన్ వెహికల్ (ఏటీవీ)ను పోటీకి నిలిపి వాహన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే చక్కటి వేదికగా బాహ సే ఇండియా నిలుస్తోందని సంస్థ నిర్వాహక కమిటీ అధ్యక్షులు బాలరాజు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈనెల 20 నుండి 25 వరకు కొనసాగనున్న బాహ సే ఇండియా 2025 ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను గురువారం బేగంపేట్‌లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఎత్తుపల్లాలు ఉండే ప్రాంతంలో జరిగే ఈ ఏటీవీ వాహనాల రేసింగ్‌లో దేశ నలుమూలల నుంచి వచ్చిన 85 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఏటీవీ వాహనాలను ఈ రేసులో పరుగులెక్కించడం ద్వారా ఆయా వాహనాల సామర్థ్యాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు తాము రూపకల్పన చేసి తయారు చేసిన ఏటివి వాహనాలను ఈ ఈవెంట్ లో స్వయంగా పరీక్షించేందుకు వీలుగా నడుపుతూ పోటీపడతారని, ఈ పోటీ స్టాటిక్ డైనమిక్ అండ్యురెన్స్ వంటి విభాగాల్లో పరీక్షించబడుతుందని, యువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ ప్రతిభను ప్రదర్శించడంతోపాటు నిజజీవిత అనుభవాన్ని పొందేందుకు, అవసరమైన పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఈవెంట్ గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు.
సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఎస్‌ఏఈ బాహ సే ఇండియాతో కలిసి నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల ఈవెంట్ పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొందన్నారు. ఈ సమావేశంలో(జివిఆర్ఐటి) శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య విస్సం, బిపిసిఎల్ టెరిటరీ మేనేజర్ శ్రవణ్ కుమార్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆడేలినా పోపోవీసి, బాహ సే ఇండియా కన్వీనర్ వినోద్ కుమార్ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.