సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ) : నగరంలో అన్నీ రూట్స్ రద్దీని తలపించేవే. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం కొన్ని రూట్లను అత్యంత రద్దీగా ఎంపిక చేసి అత్యధిక బస్సులను ఆ రూట్లకు మళ్లిస్తున్నారు. ఇందులోనూ ఒకే రూట్ బస్సులు ఒకే సమయానికి వస్తుండటం.. అవి వెళ్లాక వాటి కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూడాల్సి రావడం గమనార్హం. ఆరంఘర్, మెహిదీపట్నం-ఉప్పల్ రూట్లో ప్రతీ రోజు 107 ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సులు నడుస్తున్నాయి.
ఈ రూట్లో ఆర్టీసీ రోజుకు 428కి పైగా బస్సు ట్రిప్పులు నడుపుతుండగా 60వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, ఈ రూట్లో మరిన్ని బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. కానీ మిగిలిన రూట్లపై ఆర్టీసీ దృష్టిసారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సూపర్వైజర్లతో బస్టాండ్లపై నిఘా ఉంచుతున్నారు. ఒకే సమయానికి బస్సులు వస్తుండటం ఒకేసారి వెళ్లిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత సమయానికి అనుగుణంగా బస్సులు నడుస్తున్నాయా లేదా అని వాళ్లు ఆరా తీయనున్నారు.
మరోవైపు గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు విజప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. ఒకటి, రెండు రూట్లలోని రద్దీ ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో నగర శివారు ప్రయాణికులు సైతం గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆగమాగమవుతున్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రజా సంఘాలు, విద్యార్థులు కలిసి లక్ష సంతకాల క్యాంపెయిన్ నిర్వహించి బస్సులు పెంచాలని డిమాండ్ చేశారు.
క్యాంపెయిన్ రిపోర్ట్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందించినా ఫలితం లేదు. మరోవైపు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 95శాతానికి పెరిగింది. గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ నడుపుతున్న సిటీ బస్సులో రోజు 24 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా వారిలో 15-18 లక్షల మంది వరకు మహిళలే ఉంటున్నారు. ప్రయాణికుల రద్దీ రెట్టింపైనా ఆర్టీసీ అధికారులు 25 బస్ డిపోల మేనేజర్లు రద్దీ సమయాల్లో చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాన మార్గాల నుంచి శివార్లకు బస్సులు అందుబాటులో లేవని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు బస్సులు మారితేగానీ శివార్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.