స్వచ్ఛమైన ప్రాణవాయువు అందాలన్నా.. పర్యావరణంలో సమతుల్యత ఉండాలన్నా.. మొక్కలు నాటాలి.. వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలి. కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్ నగరంలో ఆహ్లాదం పదిలంగా ఉండేలా.. పచ్చదనం పరిఢవిల్లేలా.. హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టింది బల్దియా. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించేందుకు కార్యాచరణతో ముందుకెళ్లింది. ఆ కృషి ఫలితం..కండ్ల ముందు కదలాడుతున్నది. నగరంలో ఎటుచూసినా.. పచ్చందాలు కనువిందు చేస్తున్నాయి. హరితహారం ద్వారా విస్తృతంగా మొక్కలు నాటడంతో గ్రేటర్ మొత్తం గ్రీనరీమయమైంది. పచ్చదనంతో పాటు వినోదాన్ని అందించేందుకు రూ. 132 కోట్లతో చేపట్టిన 57 థీమ్ పార్కులనూ దశల వారీగా అందుబాటులోకి తెస్తున్నది జీహెచ్ఎంసీ. నగరవాసులు ప్రకృతి అందాలను ఆస్వాదించేలా 406 ట్రీ పార్కులనూ ఏర్పాటు చేసింది. కాగా, గతేడాది ప్రపంచ హరిత వేదికపై దేశం గర్వించేలా నగరం వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును దక్కించుకున్నది.
సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నది. ఎక్కడ చూసినా.. ‘హరితం’తో కళకళలాడుతున్నది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్న బల్దియా..చక్కటి కార్యాచరణతో గ్రేటర్‌వ్యాప్తంగా గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నది. వినూత్నంగా వివిధ పద్ధతుల ద్వారా మొక్కలు నాటి.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నది. హరితయజ్ఞం ఫలితంగా గతేడాది నగరం వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును సైతం అందుకోవడం విశేషం.
థీమ్, ట్రీ పార్కులు
నగర వ్యాప్తంగా 132 కోట్ల రూపాయల వ్యయంతో 57 థీమ్ పారులను చేపట్టారు. అందులో ఆరు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవి తుది దశలో ఉన్నట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. ఎల్బీనగర్ జోన్లో 13 థీమ్ పార్కుల్లో ఒకటి పూర్తయింది. చార్మినార్ జోన్లో మూడు వివిధ దశల్లో ఉన్నాయి. ఖైరతాబాద్ జోన్లో14 థీమ్ పార్కులను చేపట్టగా, ఒకటి పూర్తి చేస్తే.. మిగితావి పురోగతిలో ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్ లో 10 పనులకు గాను రెండింటిని పూర్తి చేశారు. కూకట్పల్లి జోన్లో 6 పనులు చేపట్టగా, ఒకటి పూర్తయింది. సికింద్రాబాద్ జోన్లో 11 పార్కులకు ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 406 ట్రీ పార్లను ఏర్పాటు చేశారు.
సుందరంగా సెంట్రల్ మీడియన్లు
ఇప్పటి వరకు 186 లోకేషన్లలో 176.32 కిలోమీటర్ల పొడవు గల సెంట్రల్ మీడియన్లను సుందరీకరించారు. ఎల్బీ నగర్ జోన్లో 18 లొకేషన్లలో 27.64 కి.మీ పొడవుతో , చార్మినార్ జోన్లో 13 (19.63 కిలోమీటర్ల పొడవుతో), ఖైరతాబాద్ జోన్లో 31(26.3 కిలోమీటర్ల పొడవుతో), శేరిలింగంపల్లిలో 66( 62.17 కిలోమీటర్ల పొడవుతో), కూకట్ పల్లి లో 29.35 కిలోమీటర్ల పొడవుతో 38 లొకేషన్లు, సికింద్రాబాద్ జోన్లో 11.24 కిలోమీటర్ల పొడవు గల మీడియన్‌ను 20 లొకేషన్లలో సుందరీకరించారు.