హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 20: గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్, ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లకు రోజు వారీ గిరాకీ లేదని, దీంతో రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మంది ఆటోడ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వయం ఉపాధి పొందేందుకు ప్రైవేట్ ఫైనాన్సియర్ల వద్ద రుణాలు తీసుకుని ఆటోలను కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.12వేలు, ఈఎస్ఐతో పాటు ఆటో, మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.
50 ఏండ్లు నిండిన ఆటో డ్రైవర్లకు పింఛన్లు ఇవ్వడంతో పాటు యాక్సిడెంటల్ బీమా రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. ఈ నెల 22, 23 తేదీల్లో కొత్తగూడెం పట్టణంలో జరిగే యూనియన్ 3వ మహాసభలకు డ్రైవర్లు అధిక సంఖ్యల్లో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ నగర అధ్యక్షుడు ఎస్. అశోక్, నగర ప్రధాన కార్యదర్శి జంగయ్య పాల్గొన్నారు.