ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల పదోన్నతుల్లో పారదర్శకత పాటించాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు లెనిన్, కార్యదర్శి నెల్లి సత్య డిమాండ్ చేశారు. గతంలో పదోన్నతుల్లో అక్రమాలపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. యూజీసీ నిబంధనల మేరకు కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీం (సీఏఎస్) ద్వారా వర్సిటీల అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలని చెప్పారు.
ప్రస్తుత ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా అధ్యాపకుల పదోన్నతి ప్రక్రియను ప్రారంభించారని అన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి పదోన్నతులకు సంబంధించిన ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. గత వీసీ హయాంలో పదోన్నతుల్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకుని గతంలో జరిగిన విధంగా అక్రమాలు జరగకుండా నాణ్యమైన పరిశోధనలు చేసి, అన్ని అర్హతలు ఉన్నవారికి ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అక్రమాలు జరిగినట్లుగా ఈసారి కూడా జరిగితే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారని, గద్దెనెక్కి రెండేళ్లు గడుస్తున్నా ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదికను బహిర్గతం చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నివేదికను బహిర్గతం చేసి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. లేనిపక్షంలో వర్సిటీకి వివిధ పరిశోధన సంస్థల నుంచి వచ్చే పరిశోధనా నిధులను కోల్పోయే ప్రమాదముందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అశ్వన్, రమేశ్, సుమన్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.