హిమాయత్‌నగర్,ఏప్రిల్28: లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హిమాయత్‌నగర్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వరకు పాదయాత్రగా ఏఐఎస్ఎఫ్ నేతలు,కార్యకర్తలు బయలు దేరారు.
పాదయాత్రను మార్గమధ్యలో నారాయణగూడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అప్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ అందక పోవడం వల్ల సుమారు 15 లక్షల మంది విద్యార్థులు విద్యను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ నేతలు బానోతు రఘురాం, గ్యారనరేశ్, లెనిన్, రా జు,ప్రవీణ్,ఎండీ అన్వర్,రామగల్ల నరేశ్, ఆంజనేయులు,శాంతి కుమార్,కైలాశ్,దత్తురెడ్డి,సాయి తదితరులు పాల్గొన్నారు.