Hyderabad | సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో గాలి నాణ్యత పడిపోతున్నది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేకపోవడంతో.. ఏడాది కాలంలోనే కలుషిత నగరాల జాబితాలో చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉన్నదని వెల్లడైంది. మొదటి స్ధానంలో ఢిల్లీ ఉండగా… నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే బెంగళూరు, చెన్నై నగరాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉన్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా పర్యావరణ పరిరక్షణ పడకేసింది. కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణ లోపంతో నగరంలో గాలి నాణ్యత వేగంగా పడిపోతున్నది. దీనికి తోడు విపరీతంగా పెరిగిన వాహనాల రద్దీతో గాలిలో దుమ్ము, ధూళి కణాల ప్రభావం భారీగా ఉందని తేలింది.
దీంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిక దారుణంగా పడిపోతున్నది. దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఏడో స్థానంలో ఉంది. నగరంలో పీల్చే గాలి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోవడంలో వాహనాల రద్దీ, కర్బన ఉద్గారాల తీవ్రత, పరిశ్రమల వ్యర్థాలే ప్రధానం. అయితే వీటిని నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి వైఫల్యంతో నగరం కాలుష్య కాసారంగా మారుతున్నది.
దేశంలోని ప్రధానమైన కలుషిత నగరాల జాబితాను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆధారంగా రూపొందించారు. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 567తో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో పాట్నా, కోల్‌కతా, లక్నో, జైపూర్, భోపాల్ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 170గా నమోదైంది. ఇక నిత్యం ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే ముంబై, బెంగళూరు నగరాల్లోనూ హైదరాబాద్ కంటే మెరుగైన వాతావరణమే ఉండటం విశేషం. పొల్యూటేడ్ నగరాల జాబితాల్లో ఈ రెండు నగరాలు కూడా 11, 12 స్థానాల్లో ఉన్నాయి.