హైదరాబాద్: శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం సుమారు మూడు గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం విమానాన్ని పైలట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నారు.
కాగా, చెన్నైలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. దీంతో అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.