‘పేదోళ్ల జోలికొస్తే.. మీకేం వస్తుంది.. పేషంట్లు ఉన్నారు.. ఇప్పటికిప్పుడు బయటకు పొమ్మంటే.. ఎటుపోవాలే.. మంచిగా బతికేటోళ్లం.. రోడ్డున పడ్డాం.. చిన్నపిల్లలను పెట్టుకుని ఎక్కడికి పోవాలె’.. ఐలాపూర్ కూల్చివేతల బాధితులు ఆవేదన ఇది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా సృష్టించిన విధ్వంసంతో పలువురు రోడ్డున పడ్డారు. కుటుంబాలకు కుటుంబాలను బయటకు పంపించి టవర్స్ కూల్చేసిన హైడ్రా.. ఆ తర్వాత అక్కడ ఉన్న గృహాలను కూల్చేసింది. తమకు అన్ని అనుమతులున్నా.. ఎందుకు కూల్చేస్తున్నారంటూ హైడ్రాపై బాధితులు తిరగబడ్డారు. కొందరైతే మన్నుపోశారు. కాంగ్రెస్ సర్కార్‌పై దుమ్మెత్తిపోశారు. కాగా, సోమవారం ఐలాపూర్‌లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూమికి ఫెన్సింగ్ పూర్తి చేసింది. అయితే బాధితులు మాత్రం హైడ్రా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ఉసురు తగులుతుందంటూ.. ప్రభుత్వానికి శాపనర్థాలు పెట్టారు.
-సిటీబ్యూరో, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా సృష్టించిన విధ్వంసంతో పలువురు రోడ్డున పడ్డారు. కుటుంబాలకు కుటుంబాలను బయటకు పంపించి టవర్స్ కూల్చేసిన హైడ్రా ఆ తర్వాత అక్కడ ఉన్న ఇళ్లను కూల్చేసింది. తమకు ఇంటిపట్టాలున్నా ఎందుకు కూల్చేస్తున్నారంటూ హైడ్రాపై బాధితులు తిరగబడ్డారు. కొందరైతే మన్నుపోశారు. అయినా పట్టింపు లేకుండా అధికారులు కూల్చివేతలు చేపట్టి వెళ్లిపోయారంటూ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐలాపూర్‌లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూమికి సిబ్బంది సోమవారం ఫెన్సింగ్ పూర్తిచేశారు. ఈ సమయంలో బాధితులు హైడ్రా తీరుపై మండిపడ్డారు. పేదోళ్ల ఇళ్లను కూలిస్తే కాంగ్రెస్ సర్కార్, హైడ్రాకు ఏం వస్తుంది అని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డికి మెంటలెక్కింది
మా ఇంటికి అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు కూల్చేస్తున్నరు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బిల్డర్స్ పైసలియ్యలేదు కాబట్టే హైడ్రాతో కూల్చివేతలు చేస్తున్నడు. హైడ్రా పేరుపెట్టుకొని రేవంత్‌రెడ్డి చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. బిల్డర్లను బెదిరించడానికి మమ్మల్ని వాడుకుంటున్నరు. మంచిగ బతికేటోళ్లం.. రోడ్డున పడ్డాం. చిన్న పిల్లలతో సహా రేవంత్ పాలనను తిట్టిపోస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోయి చికిత్స చేయించాలె. కేసీఆర్ పాలనే చాలా మంచిగా ఉండే. – హైడ్రా కూల్చివేతల బాధితుడు
పిల్లలను తీసుకొని ఎక్కడికి పోవాలె?
చిన్నచిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నం. ఈ రేవంత్‌రెడ్డి వచ్చి మాకు నీడ లేకుండా చేసిండు. ఇళ్లు కూలగొడితే మీకేం వస్తది. సడెన్‌గా మమ్మల్ని బయటకు పొమ్మంటే ఎక్కడకు పోవాలె. మా ఆయన డయాలిసిస్ పేషంట్. ఆయనకేమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు. నాకు బతుకుదెరువు లేదు. నాకొడుకుకు ప్లాంట్ పెట్టిస్తే ఉన్న ప్లాంట్ తీసి బయటపడేసిర్రు. ప్రజాపాలన ఎక్కడిది. మహిళల కోసం అన్నరు. ఇప్పుడు మహిళలను చూసి కూడా ఊరుకోవడం లేదు. చిన్నచిన్నపిల్లలను పెట్టుకుని ఎక్కడికి పోవాలె. – బాధిత మహిళ
పేదోళ్ల మీద పడితే మీకేం వస్తది..:
50 ఏళ్ల నుంచి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఇప్పటికిప్పుడు బయటకు పొమ్మంటే ఎట్లా పోవాలి. నాకు డయాలసిస్ జరుగుతుంది. మా తమ్ముడికి కిడ్నీలు బాగాలేక సమస్యల్లో ఉన్నరు. వానాకాలం, ఎండాకాలం అన్ని పంటలు పెడుతున్నం. ఇప్పుడు బోర్లు నీళ్లు పోస్తలేదు కాబట్టి పంట పెట్టలేదు. మమ్మల్ని బయటకు పొమ్మంటే ఏ చెట్టుకిందికో పోయి ఉండాలె. లేకపోతే రేవంత్‌రెడ్డి ఇంట్లో ఉంటం. ఇల్లు ట్యాక్స్ ఉంది. కరెంట్ బిల్లు ఉంది.. ట్రాన్స్ఫార్మర్ ఉంది, పట్టా ఉంది. అయినా కూల్చేశారు. పేదోళ్ల మీద పడితే మీకేం వస్తది.
– ఐలాపూర్ కూల్చివేతల బాధితులు