ATR | సిటీబ్యూరో: హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులకు సంబంధించిన చికిత్సా కేంద్రాలైన ఏఆర్టీ సెంటర్లను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గాలికొదిలేసింది. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆయా దవాఖానలు, ఎన్జీవోలకు అప్పజెప్పి మొక్కుబడి బాధ్యతలు నిర్వర్తిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నగరంలో 5చోట్ల ఏఆర్టీ సెంటర్లు రోగులకు చికిత్స అందిస్తున్నాయి. అందులో ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కింగ్‌కోఠి జిల్లా దవాఖానల్లో ఈ సెంటర్లను నిర్వహిస్తున్నారు. కింగ్‌కోఠి దవాఖాన మినహా మిగిలిన నాలుగు దవాఖానల్లో ఉన్న ప్రతి ఏఆర్టీ సెంటర్‌కు ముగ్గురు వైద్యులు ఉండాలి. కానీ గత కొన్ని రోజులుగా అక్కడ పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో ఇటీవలే వైద్యుల నియామకానికి సంబంధించి ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు చర్యలు చేపట్టింది.
దీంతో రెండు రోజుల కిందట ఉస్మానియా దవాఖానలో ఏఆర్టీ వైద్యుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను టీ సాక్స్ అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో కొందరు టీసాక్స్ అధికారులు పాల్గొన్నప్పటికీ నియామక ప్రక్రియ మొత్తం ఆయా సెంటర్ల నోడల్ అధికారులు, సూపరింటెండెంట్ల చొరవతోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతి రోజూ 300 మంది ఓపీ ఉండే ఉస్మానియా ఏఆర్టీ సెంటర్లో కేవలం నెల వారీ ఏఆర్టీ మందులు తీసుకునేందుకే మూడు గంటల సమయం పడుతున్నదని రోగులు చెబుతున్నారు. సెంటర్లో ఓపీ సమయం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉన్నా అక్కడి సిబ్బంది ఒంటి గంట లోపే రావాలని హుకూం జారీ చేయడంతో 9 నుంచి 12 గంటల సమయంలోనే రోగులు పెద్ద సంఖ్యలో రావడంతో రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్దే గంట సమయం పడుతున్నదని, అక్కడి నుంచి కౌన్సిలర్ వద్దకు వెళ్లేందుకు దాదాపు మరో గంట నిరీక్షించాల్సి వస్తున్నదని, ఆ తరువాత ఏదైనా సమస్య కోసం వైద్యుల వద్దకు వెళ్తే వారు చికిత్స అందించకుండా జనరల్ ఓపీకి వెళ్లి చూయించుకోమని చెప్పడం, అప్పటికే అక్కడ ఓపీ సమయం మించిపోవడంతో చేసేది లేక వెనుతిరిగి పోవాల్సి వస్తున్నదని రోగులు బోరుమంటున్నారు.
వైద్యులకు ఏఆర్టీ సెంటర్‌కు సంబంధించిన డేటా రిపోర్టింగ్ పని, దవాఖానల్లో జరిగే భవన నిర్మాణ పర్యవేక్షణ వంటి పనులను అప్పగించడంతో వారు రోగులకు అందుబాటులో ఉండలేకపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 300 వరకు ఓపీకి వచ్చే ఉస్మానియా ఏఆర్టీ సెంటర్‌కు ముగ్గురు వైద్యులు ఉండాలి. కానీ మొన్నటి వరకు ఉన్న ఒక్కరిద్దరు వైద్యులకు కూడా డేటా రిపోర్టింగ్, కన్స్ట్రక్షన్ వర్క్ వంటివి అప్పగించడంతో వారు రోగుల చికిత్సపై దృష్టి పెట్టలేకపోతున్నట్లు రోగులు వాపోతున్నారు.
కొన్ని సెంటర్లలో సంబంధిత అధికారులు సరైన అవగాహన లేని వైద్యులను నియమించడం, నియామకాల్లో అవకతవకలకు పాల్పడటంతో ఏఆర్టీ సెంటర్లకు వచ్చే వైద్యులు రోగుల సమస్యలను అర్థం చేసుకోలేక చేతులెత్తేయడం లేదా ప్రతి చిన్న సమస్యకు రోగులను జనరల్ ఓపీకి రెఫర్ చేయడం జరుగుతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. ఏఆర్టీ సెంటర్లలో అనుభవం, అవగాహన ఉన్న వైద్యులను నియమించాలని, నియామక ప్రక్రియ మొత్తం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీనే చేపట్టాలని రోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఏఆర్టీ సెంటర్లలో వైద్యులను నియమించాల్సిన తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆ బాధ్యతలను ఆయా దవాఖానలకు అప్పగించింది. దీంతో కొన్ని సెంటర్లలో ఆయా దవాఖానల అధికారులు అవగాహన లేని వైద్యులను నియమిస్తుండగా, మరికొన్ని సెంటర్లలో కొందరు అధికారులు ఆ పోస్టులను తమకు నచ్చినవారికి కట్టబెడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని పలు ఏఆర్టీ సెంటర్లలో అక్కడి వైద్యులు చికిత్స అందించకుండా రోగులను జనరల్ ఓపీలో చూపించుకోవాలని పంపిస్తున్నట్లు బాధిత రోగులు ఆరోపిస్తున్నారు.
హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగుల కోసం ఏఆర్టీ సెంటర్లలోనే ప్రత్యేక ఓపీ ఉంటుంది. అక్కడకు వచ్చే రోగులను ఏఆర్టీ సెంటర్ వైద్యులు పరిశీలించి అవసరమైన చికిత్స అందించాలి. అవసరమైన వైద్యపరీక్షలు, మందులను ప్రిస్క్రిప్షన్‌లో రాసి ఇవ్వాలి. ఏవైన దీర్ఘకాలిక, లేదా ఇతర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సంబంధిత చికిత్స అవసరమున్న రోగులను మాత్రం సంబంధిత విభాగాలకు రెఫర్ చేయాలి. కానీ ఉస్మానియా వంటి సెంటర్లలో అలా జరగడం లేదు.