Hyderabad | అమీర్ పేట్, ఫిబ్రవరి 8 : ఏఐ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మన పనితీరులో మార్పులు చోటు చేసుకుంటున్నాయనే విషయాలను మనం గుర్తించాలని, అందుకు అనుగుణంగా మనం మన పని తీరును మార్చుకోవాల్సి ఉంటుందని సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం అమీర్‌పేట్‌లోని హోటల్ మారిగోల్డ్‌లో జరిగిన హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నాయకత్వ సదస్సు – 2025కు బి.వి.ఆర్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోపన్యాసం చేశారు.
సదస్సులో భాగంగా పిడబ్ల్యుసి భాగస్వామి రాజేష్ దొడ్డు, బి.వి.ఆర్ మోహన్ రెడ్డి మధ్య జరిగిన ప్యానెల్ చర్చ అర్థవంతంగా సాగింది. 1960లో ప్రారంభమైన మొదటి ఏఐ అప్లికేషన్, 0.28 ఎంబి ర్యామ్ సామర్థ్యంతో మాత్రమే ఉన్న అప్పటి కంప్యూటర్, తదనంతర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆసక్తికర సంభాషణ వీరి మధ్య చోటుచేసుకుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఏఐ మొదటి పీహెచ్‌డీని 1960 లోనే రాజిరెడ్డి రాజ్ రెడ్డి అనే భారతీయుడు పూర్తి చేసిన విషయంతో పాటు 1985 నాటి కాలంలో కంప్యూటర్ స్టోరేజ్‌కి ర్యామ్‌లు మొదట కేబీలో ఉండేవని ఆ తర్వాత ఎంబీ ఇప్పుడు జీబీలలో ఉన్నాయని, ఇవి ఇప్పుడు టీవీలకు కూడా చేరుకుంటున్నాయని, స్టోరేజ్‌కి కూడా మొదట 80కేబీల ఫ్లాపి మాత్రమే ఉండేదని, ఇప్పుడు క్లౌడ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, చిన్న చిన్న సెన్సార్లు కూడా అందుబాటులో ఉండడంతో అవి డేటా సముద్రాన్ని మధనం చేస్తున్నాయన్నారు.
దీంతోపాటు నాయకత్వ స్థానాలపై ఏఐ ప్రభావం వంటి అంశాలపై ప్యానల్ చర్చ ఆసక్తికరంగా కొనసాగింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ వైవిధ్యం అనేది చాలా అద్భుతమైనదని మేనేజర్ స్థానంలో ఉన్నప్పుడు ఉపాధి కోసం వచ్చే వారిని వెనుకబడిన తరగతులు, మహిళలు అని చూడకుండా అందరిని ఆదరించాలని, 40 ఏళ్ల క్రితం సాధించిన విజయాలు ఇప్పుడు అవసరం లేదని, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యమని, చదువులు, సంస్థలు ముఖ్యం కాదని, మనుషుల్లో నేర్చుకునే సామర్థ్యం ఉంటుందని దానిని గుర్తించి వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రుల డైరెక్టర్ సంగీతారెడ్డి, ఐటీసీ గ్రూప్ హెడ్ శివకుమార్, హెచ్ఎంఏ మేనేజింగ్ కమిటీ సభ్యులు అల్వాల దేవేందర్ రెడ్డి, కార్యదర్శి శరత్ చంద్ర, సహ కార్యదర్శి ప్రొఫెసర్ రేణుక సాగర్ తదితరులు పాల్గొన్నారు.