“పంట కాలం వచ్చిందంటే రైతులకు వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో ఎవ్వరికీ రానీ కష్ట నష్టాలన్నీ రైతులకే వచ్చేవి. ఇదంతా గత పాలకుల హయాంలోనే.., గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయాన్ని దండుగ అన్నారు. సాగును నిర్లక్ష్యం చేసిన్రు. రైతులను అరిగోస పెట్టుకున్నరు. వేలాది మంది రైతుల చావుకు కారకులైన్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. ఇప్పుడు సీను రివర్సు అయ్యింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం పంటకు పెట్టుబడి, సాగునీరు, ఎరువులను సైతం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దండుగ అన్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగ చేసింది.”
మేడ్చల్, జూన్27(నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుతున్న నేపథ్యంలో వ్యవసాయం రంగం విశేషంగా అభివృద్ధి సాధించింది. యాసంగి, వాన కాలం సీజన్లకు ముందే పంటల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రైతులు పండించే పంటల సాగు వివరాల నమోదును వ్యవసాయాధికారులు సేకరించి పంటలకు కావాల్సిన ఎరువులను అంచనా వేసి నెల రోజుల ముందు నుంచే అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గత తొమ్మిదేండ్లుగా ఎరువుల కొరత లేకుండా పోయింది. రైతుబంధు పథకం ద్వారా పంటకు పెట్టుబడి సాయం, 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, ఎరువులను అందుబాటులో ఉంచటంతో వ్యవసాయాన్ని రైతులు పండగలా చేసుకుంటున్నారు.
సాగుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు
వానకాలం పంటల సాగు ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)కు అనుగుణంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అందుబాటులో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచారు. జిల్లా వ్యాప్తంగా 33,000 వేల ఎకరాల పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో వరి, మొక్కజోన్న, కంది, జొన్న, పత్తి (కాటన్), పచ్చిగడ్డి, కూరగాయలు, వివిధ రకాల పండ్లు, ఇతరత్రా పంటలు సాగు చేస్తున్నారు. పంటలకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను సొసైటీలతో పాటు ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయాధికారులు వెల్లడిస్తున్నారు.
ప్రభుత్వం చర్యల వల్ల ఎరువుల కొరత లేదు
ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఎరువుల కోరత లేకుండా పోయింది. రైతులకు కావాల్సిన ఎరువులను ముందుగానే అంచనా వేసి నాణ్యత ప్రమాణాలను పరీక్షించి సోసైటిల, ప్రవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి 5 వందల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉండి పంటల వివరాల నమోదు చేయడతంతో ఎరువుల అసవరాలను గుర్తించి సరఫరా చేస్తున్నాం.
-మేరీ రేఖ, మేడ్చల్ జిల్లా వ్యవసాయాధికారి
ఇది రైతు ప్రభుత్వం
రైతులకు అన్ని విధాలుగా సహకరించి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. నాడు ఎరువుల కోసం గంటల తరబడి నిలబడి ఎరువుల దోరకకుండానే ఇంటికి తిరిగి వచ్చే వారం. ఇప్పుడేమో ఎరువుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా పోయింది. సొసైటీలతో పాటు ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్ల వద్ద ఎరువులు లభిస్తున్నాయి. సీఎం సార్ స్వతహాగా రైతు కావడంతో బాధిత రైతుల కష్ట నష్టాలను చవి చూడగలిగారు. అందుకే రైతులకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో ఉంచారు.
– చిలుగూరి మంకయ్య, రైతు మర్రిపల్లిగూడ
ఎరువుల బెంగ పోయింది
గత 9 ఏండ్లుగా ఎరువులకు బెంగ లేకుండా పోయింది. కావాల్సినన్ని ఎరువులు దొరుకుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. పంటల వివరాల నమోదులో తమకు కావాల్సిన ఎరువులు ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. ఇలాంటి రైతు ప్రభుత్వమే ఎప్పుడు కొనసాగాలి. రైతులను రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందుకే రైతులకు ఎలాంటి ఇబ్బందులను లేకుండా చూసుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలి.
– ఇంద్రారెడ్డి, రైతు, ఎదులాబాద్