వ్యవసాయ యూనివర్సిటీ, మే 24: ఔషధ మొక్కల సాగుతో ఆరోగ్యంతోపాటు ఆదాయం కూడా అధికంగా ఉంటుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ డీ రాజిరెడ్డి పేర్కొన్నారు. ఔషధ, సుగంధ మొక్కల పరిశోధన కేంద్రం రాజేంద్రనగర్లో ‘మిషన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ 2024 -25’ అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఔషధ మొక్కల సాగు చేస్తున్న రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా శాస్తవ్రేత్తలు, సాంకేతికా నిపుణులు రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
ఔషధ మొక్కల పెంపకం ఎంతో సులువైందని వీటికి తక్కువ యాజమాన్య పద్ధతులు అవసరమవుతాయని తెలిపారు. చీడపీడల బెడద చాలా తక్కువ ఉంటుందని, రైతులు మిగతా పంటలకు కూడా చీడపీడల నుంచి రక్షించుకునేందకు ఔషధ మొక్కలను నాటుకోవచ్చని తెలిపారు. సరైన మార్కెటింగ్ ఉంటేనే రైతులు మంచి లాభాలను ఆర్జిస్తారని వివరించారు. తెలంగాణ ప్రాంతంలోని నేలలన్నీ ఔషధ పంటలకు అనుకూలమేనని అన్నారు.
రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో రైతులకు అవసరమయ్యే విధంగా ఔషధ సుగంధ ద్రవ్య మొక్కలను నర్సరీలలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. రైతులు ఔషధ మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని వీసీ కోరారు రిజిస్టర్ డాక్టర్ భగవాన్, డీన్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ సురేష్ కుమార్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ చీనానాయక్, కూరగాయల పరిశోధన కేంద్రం హెడ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ అనిత కుమారి, ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్ అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రశాంత్, ఔషధ, సుగంధ మొక్కల పరిశోధన స్థానం హెడ్, శాస్తవ్రేత్త శ్రీమతి కృష్ణవేణి, తెలంగాణ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ హైదరాబాద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేంద్రకుమార్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ హైదరాబాద్ డాక్టర్ జ్ఞానేశ్వర్ , శాస్తవ్రేత్తలు బోధన, బోధ నేతర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.