మేడ్చల్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న క్రమంలో ఏజెన్సీ కార్మికులు పథకాన్ని ఎలా కొనసాగించాలని ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులతోపాటు కార్మికులు వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి మధ్యాహ్న భోజన పథకం నిర్వహించాల్సి వస్తున్నదని పేర్కొంటున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 505 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మధ్యాహ్న భోజన పథకం కొనసాగగా, మూడు నెలల బిల్లులతో పాటు 1800 మంది కార్మికులకు వేతనాలు కలిపి రూ. 2 కోట్ల 10 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బిల్లులు పెండింగ్లో పెట్టి వేతనాలు అందించపోతే తాము మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తలకు మించిన భారం ఏర్పడుతుందని ఏజెన్సీ కార్మికులు వాపోతున్నారు. ఇలా బిల్లులు పెండింగ్లో పెట్టి విద్యార్థులకు నిబంధనల మేరకు మోనులో ఉన్న ఆహారాలన్నీ అందించాలంటే ఏజెన్సీ కార్మికులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నది.
మధ్యాహ్న భోజన పథకం పెండింగ్లో ఉన్న బిల్లుల అందించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెలకొకసారి బిల్లులు చెల్లించి, కార్మికులకు వేతనాలు అందిస్తే మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించే అవకాశం ఉంటుందని ఏజెన్సీ కార్మికులు పేర్కొంటున్నారు. మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని అధికారులు ఆదేశించినప్పుడు బిల్లులు చెల్లించడంలో వారు ఎందుకు ముందుకు ఉండటం లేదని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ బిల్లులు, కార్మికల వేతనాలు అందించి అప్పుల పాలు కాకుండా చూడాలని కోరుతున్నారు. మూడు నెలల బిల్లులు తక్షణమే అందించాలని కోరారు.