మియాపూర్ , ఫిబ్రవరి 18 : జల్సాలకు అలవాటు పడి..డబ్బులు సంపాదించాలన్న దురాశతో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన నిందితులను మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ నర్సింహారావు వివరాలు వెల్లడించారు. హఫీజ్‌పేట్ మార్తాండ్‌నగర్, వరంగల్ జిల్లాకు చెందిన వేణువంక సురేశ్(23) , వడ్లూరి నిఖిల్(21) మిత్రులు. నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు.. డబ్బు సంపాదించాలన్న దురాశతో చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 8న మియాపూర్ కృషినగర్కు చెందిన మందలపు జ్యోతి తన కుమారుడిని పాఠశాల నుంచి తీసుకొస్తుండగా, ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చిన సురేశ్, నిఖిల్ ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును తస్కరించారు. ముఖానికి, వాహనం నంబర్ ప్లేట్లకు మాస్కులు ఉండటంతో బాధితురాలు వారిని, నంబర్‌ను గుర్తించలేకపోయింది. ఈ ఘటనపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా….క్రైం విభాగం పోలీసులు సుమారు 500 సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు వాడిన ద్విచక్ర వాహన నంబర్‌ను గుర్తించారు. పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి 4 తులాల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నర్సింహారావు పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన క్రైం పోలీసులను ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో మియాపూర్ సీఐ తిరుపతి, డీఐ కాంతారెడ్డి, సీసీఎస్ ఏసీపీ శశాంక్‌రెడ్డి, సీఐ ప్రేమ్‌కుమార్, డీఎస్ఐ జగదీశ్ పాల్గొన్నారు.