ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 21 : ఉస్మానియా యూనివర్సిటీని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఓయూ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా, కరోనానంతర క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంతో పాటు ఇక్కడి యూనివర్సిటీలు తమకు చాలా మద్దతు అందించాయని అన్నారు. తమ దేశ విద్యార్థులకు ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీ అందిస్తున్న సహకారాన్ని మర్చిపోలేమని చెప్పారు.
పంజాబ్, పుణె విశ్వవిద్యాలయాల తరువాత తమ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో విద్యనభ్యసించేది తెలంగాణలోని యూనివర్సిటీల నుంచేనని గుర్తు చేశారు. మరెంతో మంది విద్యార్థులు భారతీయ యూనివర్సిటీలలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ, పాస్పోర్ట్ పునరుద్ధరణ, స్కాలర్షిప్ల జారీకి సంబంధించిన సమస్యలు ఉండడం అడ్డంకిగా మారిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో అఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయ అధికారులు ఖాదిర్ షా, సయ్యద్ మొహమ్మద్ ఇబ్రహీంఖిల్, సెడిఖుల్లా సహర్, ఇద్రెస్ మముంజాయ్, ఓయూ అధికారులు ప్రొఫెసర్లు రవీందర్, లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్, అప్పారావు, సరితారెడ్డి, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
యూకే వర్సిటీల ప్రతినిధుల బృందం
ఉస్మానియా యూనివర్సిటీని యూకే యూనివర్సిటీల ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. యూకేలోని వర్సిటీల సహకారంతో ఆధునిక అభివృద్ధికి అనుగుణంగా పాఠ్యప్రణాళికలో మార్పుల కోసమై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న సదస్సుకు ఈ బృందం హాజరైంది. బృందం సభ్యులు యూనివర్సిటీ అంతా కలియతిరిగారు. అనంతరం ఓయూ అధికారులతో సమావేశమై ఓయూతో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. యూజీ విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర మార్పిడి, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులు, నిధులు తదితర విషయాలు సైతం ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అబెరిస్ట్విత్ యూనివర్సిటీ ప్రో వీసీ తిమోతీ వుడ్స్, బెవర్లీ హెర్రింగ్, బంగోర్ యూనివర్సిటీ ప్రో వీసీ ప్రొఫెసర్ నికోల క్యాలో, డాక్టర్ అమా బస్సీ ఇయో తదితరులు పాల్గొన్నారు.