కుత్బుల్లాపూర్, జూలై 11: జాతీయ రహదారి 44 లోని కొంపల్లి ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులు వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపుతున్నాయి. దూలపల్లి నుండి నర్సాపూర్ రాష్ట్ర రహదారి వెళ్లే ప్రధాన దారిలో అనధికారికంగా ప్రకటన బోర్డులు లాలీపాప్స్, బాహుబలి వంటి పెద్ద పెద్ద హోర్డింగ్ లు అనధికారికంగా ఏర్పాటు చేశారు. వీటికి ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వాస్తవానికి ఈ రోడ్డు గుండా పెద్ద పెద్ద వాహనాలతో పాటు ఇతర వాహనాలు వేల సంఖ్యలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. దూలపల్లి, జీడిమెట్ల, దుండిగల్ ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రదేశాలకు ఆయా వస్తువుల తయారీ ముడి సరుకులను తరలించేందుకు ఇతర రాష్ర్టాల నుండి పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగుతాయి. దీంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా దర్శనమిస్తున్నది. దీంతోపాటుగా వివిధ విద్యా కళాశాలు, యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య, విద్యా సంస్థల వాహనాల సంఖ్య అత్యధికమే. దీంతో ఈ మార్గంలో వివిధ వాణిజ్య, నిర్మాణ రంగాలతోపాటు ఆయా రాజకీయ పార్టీల నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రచారాలను ఆర్భాటకంగా ఏర్పాటు చేసుకుంటారు.
దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులకు రోడ్డు యూటర్న్ లు చేసుకునే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి ఉండదు. కారణం రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన వివిధ ప్రకటన బోర్డులే. దీంతో నిత్యం ఈ మార్గంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల సంఖ్య కాకుండా దూలపల్లి, కొంపల్లి వాసులు నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని అగమ్య గోచరంగా ఈ మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది. అయితే అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగుల తో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత 6 మాసాలుగా ఈ మార్గంలో యూటర్న్ ల వద్ద నలుగురు మృత్యువాత పడగా.. 15కు మందికి పైగా ప్రమాదాలకు గురయ్యారు. దీంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో కూరుకుపోయారు.
వాస్తవానికి ప్రధాన హోర్డింగ్ లతో పాటు లాలీపాప్ల నిర్వహణ గత ప్రభుత్వ హయంలో గడువు ముగిసింది. అప్పటి నుండి నేటి వరకు ఎలాంటి అనుమతులు లేకుండానే సంబంధిత ప్రకటనల నిర్వాహకులు అప్రకటిత ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా వచ్చిన దాఖలాలు లేవని సమాచారం. దూలపల్లిలో 200 లాలీపాప్ 200, 20కి పైగా బాహుబలి హోర్డింగులు అక్రమంగా కొనసాగుతున్నాయి.
దీనిని ఆసరా చేసుకుని స్థానికంగా తాజా మాజీ ఎమ్మెల్యే, కొంత మంది అనుచరులు గత కొన్ని ఏండ్ల నుండి ప్రకటన నిర్వహణ వద్దనుండి నెలనెలా లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. హైడ్రా కూల్చివేసిన బాహుబలి హోర్డింగుల ను తిరిగి వారి అండదండలతో పునర్నిర్మానం చేపట్టి వసూళ్లకు మార్గంగా మలుచుకున్నట్లు విమర్శలు లేకపోలేదు. ఇంత జరుగుతున్న కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారే తప్ప చర్యలకు ముందుకు రావడం లేటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు తొలగించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన లాలీపాప్స్ తొలగించి ప్రమాదాల నుండి కాపాడాలని వాహనదారులు కోరుతున్నారు.