అది తార్నాకలో ఓ కార్పొరేట్ కాలేజీ. అందులో ఇంటర్ చదివే ఓ విద్యార్థిని డిస్కౌంట్ తీసేసి ఫీజు చెల్లిస్తామనే షరతు మీద అడ్మిషన్ తీసుకుంది. తీరా కాలేజీలో ప్రవేశం పొందాక మొత్తం ఫీజు చెల్లించాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. తరగతి గది బయట నిల్చోబెట్టి అవమానించారు. దీంతో తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో తమకు డిస్కౌంట్ ఇచ్చారు కదా అని పేపర్ చూపిస్తే అది చెల్లుబాటు కాదనీ ఉచిత పలుకులు పలికారు. దీంతో ఏం చేయాలో తెలియక వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌన్సిలింగ్‌కు వెళ్లాలంటే టీసీ కావాలని అడిగినా మొత్తం ఫీజు ఇస్తేనే టీసీ ఇస్తామని బెదిరించారు.
సిటీబ్యూరో, జూలై 21 ( నమస్తే తెలంగాణ) :విద్యార్థుల జీవితాలతో నగరంలోని కొన్ని కార్పొరేట్ కాలేజీలు చెడుగుడాడుతున్నాయి. ఫీజులే పరమావధిగా కాలేజీ నిర్వాహులు విద్యార్థులను మానసికంగా హింసిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తొలుత కాలేజీ ప్రారంభంలో డిస్కౌంట్ ఇస్తామని మా కాలేజీలనో అడ్మిషన్ తీసుకోవాలంటూ బతిమిలాడారు. తీరా అడ్మిషన్ తీసుకుని అన్ని సర్టిఫికెట్లు కాలేజీ నిర్వాహకులకు ఇచ్చాక ఇక అప్పట్నుంచి వారి విక్రుత బుద్ధి చూపిస్తూ అకడమిక్ కొనసాగుతున్న క్రమంలో ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలా ఏడాది చివరికి వచ్చే సరికి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో డిస్కౌంట్ ఇచ్చిన విద్యార్థుల దగ్గర కూడా మొత్తం ఫీజు చెల్లించాలంటూ హుకూం జారీ చేస్తున్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులను కొన్ని కాలేజీలు తీవ్రంగా వేధిస్తున్నాయి. డిస్కౌంట్ ఇచ్చారంటూ అడ్మిషన్ సమయంలో రాసిచ్చిన పేపర్‌ను చూపించినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వసూళ్ల పర్వం..!
హైదరాబాద్‌లో మొత్తం 374 ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 275 ప్రైవేట్ కాలేజీలు. ప్రతి కాలేజీలో 9 సెక్షన్ల ఏర్పాటుకు అనుమతి ఉంటుం ది. ప్రతి సెక్షన్‌కు 88 మంది విద్యార్థులు ఉంటారు. ఈ లెక్కన మొదటి, ద్వితీయ సంవత్సరానికి మొత్తం విద్యార్థులు 1584 మంది వరకు ఉంటారు. ఈ నిబంధనల ప్రకారం ఇంటర్ కాలేజీ నడుచుకోవాలి. కొన్ని కాలేజీల్లో ఈ సంఖ్యను మించిపోతుంది. సగటున ఒక విద్యార్థి నుంచి రెండేండ్లకు కనీసం లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు.
ఇది కేవలం ఫీజు మాత్రమే.. అదనంగా ల్యాబ్ ఫీజులు, కంప్యూటర్ ఫీజులు, ఉన్నత చదువుల కోచింగ్ ఫీజులు అంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 వేల నుంచి 50 వేల వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇంటర్ కాలేజీలు వ్యాపార దందా నిర్వహిస్తున్నా ఫిర్యాదులు రావడం లేదని జిల్లా బోర్డు అధికారులు చెబుతుండటం కొసమెరుపు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 214 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవి కూడా ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు మండిపుడుతున్నారు.
దోపిడీ ఆపకపోతే ఉద్యమిస్తాం
కాలేజీల్లో ఫీజు దోపిడీని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. విద్యను వ్యాపారంగా మార్చేశారు.
-ప్రదీప్,విద్యార్థి సంఘం నాయకుడు