సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఇష్టమైన ఆహారం ఆరగించాలంటే వెయిటింగ్ చేయక తప్పదు. వీకెండ్ వచ్చిదంటే నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. కుటుంబ సమేతంగా లంచ్, డిన్నర్ కోసం వెళ్లిన వారు కనీసం గంట నుంచి రెండున్నర గంటల వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది. నచ్చిన ఆహారం ఆస్వాదించాలంటే వెయిటింగ్ చేయక తప్పదని ఆహార ప్రియులు చెబుతున్నారు. రద్దీని కంట్రోల్ చేయడం కోసం హోటల్స్ నిర్వాహకులు వెయిటింగ్ టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్స్ లిస్ట్ 50 మందికి మించి ఉండటం విశేషం. అంతేకాదు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసి సీట్లు కేటాయిస్తున్నారు. డైనింగ్ గదిలో ఖాళీ అవుతున్న సీట్ల సంఖ్య ఆధారంగా ఫ్యామిలీ మెంబర్స్‌ను లోనికి ఆహ్వానిస్తున్నారు. గ్రేటర్లో సుమారు 14వందల హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నా.. వీకెండ్లో వీటిన్నింటిలోనూ కస్టమర్ల రద్దీ అధికంగానే ఉండటం విశేషం.
హైదరాబాద్ రుచుల్లో బిర్యానీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నాన్‌వెజ్‌కు ఫేమస్‌గా ఉన్న ఆ రెస్టారెంట్స్‌కు వెళ్లి మరీ ఆరగిస్తుంటారు. దూరం ఎంతైనా పర్లేదు వారానికో ప్రత్యేక వంటకం కోసం ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ముఖ్యంగా పంజాగుట్ట చౌరస్తా, బంజారాహిల్స్, నాగోల్, నారాయణగూడ, ఏఎస్రావు నగర్, కొండాపూర్, బేగంపేట్, ప్యారడైస్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, మాదాపూర్, సుచిత్ర, చార్మినార్, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, ఉప్పల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు ముందు వరుసలో ఉన్నాయి. వీకెండ్ వచ్చిందంటే ఈ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, హోటల్స్‌లో సీటు దొరకడం కష్టం. గంటకు పైగా టోకెన్ తీసుకొని ఎదురుచూడాలని పలువురు చెబుతున్నారు.
సాధారణంగా హైదరాబాద్‌లో ఏ హోటల్ అయినా రద్దీని తలపించడం సహజం. అయితే కొన్ని హోటల్స్‌లో డైనింగ్ సీటు కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కారణం అక్కడ ఉన్న ఆహార రుచులు. వాటి కోసం ఎంత సమయమైనా కస్టమర్లు ఎదురుచూస్తారు. వేరే హోటల్స్‌లో అలాంటి పరిస్థితి వస్తే మరో హోటల్‌కు వెళ్తారు. కానీ రుచికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హోటల్స్‌లో మాత్రం కస్టమర్లు మరో హోటల్ గురించి ఆలోచించరు. మేం కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా ముందు వచ్చిన వారికి వెయిటింగ్ లిస్ట్ టోకెన్ అందిస్తాం. ఖాళీ అయిన సీట్ల ఆధారంగా వారికి డైనింగ్ కల్పిస్తాం.
-మహేంద్ర, హోటల్ నిర్వాహకుడు
టేబుల్ కోసం రెండు గంటలు ఎదురుచూశాం. అరగంట మేం ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్కోసం.. గంటన్నర సమయంలో తినడం అయిపోయింది. మొత్తంగా నచ్చిన ఫుడ్ తినాలంటే మూడు నుంచి నాలుగు గంటలు, జర్నీకి గంటన్నరతో కలిపి 5 గంటలకు పైగా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కస్టమర్లు పోటీపడుతుంటారు. అంతేకాదు కుటుంబ సమేతంగా వెళితే అక్కడ దొరికే సీట్ల ఆధారంగా వేరు వేరు టేబుల్స్‌లో కూర్చోవాలి.
-అశ్విన్, కస్టమర్ సినిమా వదులుకున్నాం
మాది ఉప్పల్. చార్మినార్‌లో బిర్యానీ, పాయా బాగుంటుందని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలా రద్దీ ఉంది. రెండు గంటలు వెయిట్ చేశాక మాకు టేబుల్ దొరికింది. నగరంలో మాకు గత వారం కూడా బేగంపేటలో ఇలాంటి పరిస్థితియే ఎదురైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వెయిటింగ్ తప్పడం లేదు. ఆర్డర్ ఇస్తే ఫుడ్ ఇంటికి వస్తుంది కానీ ఫ్యామిలీతో మంచి రెస్టారెంట్లో బయటకు వెళ్లి తినడం అనేది గొప్ప అనుభూతినిస్తుంది. సినిమా కూడా చూడాలనుకున్నాం. కానీ వెయిటింగ్‌తో సమయం కుదరదనిపించింది.
-స్రవంతి, ఫుడ్ లవర్