ఖైరతాబాద్, జూన్ 12 : అసలే చాలీ చాలనీ వేతనాలు ఇస్తున్నారని, రెండు నెలలుగా అవి కూడా రావడం లేదని తెలంగాణ రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె అంగన్వాడీల విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలోని 66 వేల మంది అంగన్వాడీలు గత రెండు నెలలుగా వేతనాలు లేక అప్పులపాలవుతున్నారని, ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వేదిస్తోందన్నారు. ప్రతి నెలా జీతాల కోసం ప్రభుత్వాన్ని అడుక్కొవాల్సిన దుస్థితి దాపురించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించామని, కాని తాము దవాఖానల పాలైతే కనీసం సెలవులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. తమ ఉద్యోగం, ప్రాణాలకు భరోసా లేదన్నారు. పాలక ప్రభుత్వాలు తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయి తప్ప తమను రెగ్యూలరైజ్ చేయాలన్న ఆలోచన చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను చిన్న చూపుచూస్తున్నాయన్నారు. తక్షణమే వేతన బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రతి నెలా 1వ తేదీన జీతాలివ్వాలని కోరారు. అలాగే అప్‌గ్రేడ్ అయిన అంగన్వాడీలకు 12 నెలల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని, అవసరమైన చోట హెల్పర్లను నియమించాలని, అదనపు విధులను రద్దు చేయాలని, ప్రీప్రైమరీ పాఠశాలల్లో అర్హత కలిగిన వారికి ప్రాథమిక ఉపాధ్యాయులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో లక్ష్మి, కవిత, శ్రీలత, మల్లిక, సుజాత, శోభ తదితరులు పాల్గొన్నారు.