కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 11: వివాహమైన ఆరు నెలలకే అదనపు కట్నం వేధింపులతో ఓ యువతి (సాఫ్ట్వేర్ ఉద్యోగిణి) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా, మూసాపేట మండలం, నందిపేటకు చెందిన రావుల బుచ్చిరెడ్డి, కవిత దంపతుల కూతురు రావుల సుప్రియా రెడ్డి (26) నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మారెడ్డి పల్లికి చెందిన మద్దూరు నారాయణరెడ్డి కుమారుడు రాఘవేందర్‌రెడ్డి (30) నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చి 3న సుప్రియారెడ్డికి రాఘవేందర్‌రెడ్డితో వివాహం జరిగింది. పెండ్లి సమయంలో 25 తులాల బంగారం, రూ.20 లక్షల నగదును కట్నంగా రాఘవేందర్‌రెడ్డికి ఇచ్చారు.
ఈ దంపతులు నగరంలోని షంషీగూడలో నివాసముంటూ.. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో పలుమార్లు పెద్దలు వారిద్దరికీ సర్ధిచెప్పారు. ఊరిలో ఉన్న 3 ఎకరాల పొలం అదనపు కట్నంగా ఇవ్వాలని సుప్రియారెడ్డిని కొద్ది రోజులుగా భర్త రాఘవేందర్‌రెడ్డి వేధిస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆమె అకౌంట్లో ఉన్న డబ్బును భర్త అకౌంట్లోకి పంపించిన తర్వాత రాత్రి 11.30 గంటల సమయంలో సుప్రియారెడ్డి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు సుప్రియారెడ్డి తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు షంషీగూడలోని కూతురు ఇంటికి చేరుకునే సరికి మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.