రవీంద్రభారతి, ఫిబ్రవరి8: ప్రభుత్వ అధికారి, నామినేటెడ్ పదవి.. ఏ పదవిలో ఉన్నా ప్రజలకు.. ప్రత్యేకించి కళాకారుల శ్రేయస్సుకు పరిపాలనా దక్షతతో వారికి మేలు చేయగల నేర్పరి డాక్టర్ కేవీ రమణాచారి అని ప్రముఖ నటుడు మురళీమోహన్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో సత్కకళాభారతి, యువకళావాహిని, తెలంగాణ జానపద కళల సంఘం ఆధ్వర్యంలో విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ కేవీ రమణాచారి 75వ పుట్టినరోజు వేడుకలను ఘనంగాన నిర్వహించారు.
ఈ సందర్భంగా జానపద కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీనటుడు మురళీమోహన్ పాల్గొని రమణాచారి దంపతులను ఘనంగా సత్కరించారు. మురళీమోహన్ మాట్లాడుతూ.. ఎందరో ఐఏఎస్ పదవుల్లో రిటైర్డ్ అయినవారు విశ్రాంత జీవనం కొనసాగిస్తున్నారని, కానీ రమణాచారి రిటైర్డ్ అయినప్పటికీ ఆయనకు కళాకారులపై ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు.
ప్రభుత్వం గద్దర్ పేరిట సినీ రంగానికి ఇస్తున్న అవార్డుల మాదిరిగానే నాటకరంగానికి కూడా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. జానపద కళాకారుల సంక్షేమానికి తనవంతుగా రూ.5లక్షల రూపాయలు రమణాచారికి అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, సారిపల్లి కొండలరావు, డాక్టర్ ఓలేటి పార్వతీశం, సత్క కళాభారతి అధ్యక్షుడు సత్యనారాయణ, యువకళావాహిని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.