శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Oct 01, 2020 , 07:03:00

చురుగ్గా అభివృద్ధి పనులు.. ఎనిమిదో వార్డు అభివృద్ధికి రూ. 2కోట్ల నిధులు కేటాయింపు

చురుగ్గా అభివృద్ధి పనులు.. ఎనిమిదో వార్డు అభివృద్ధికి రూ. 2కోట్ల నిధులు కేటాయింపు

కమ్యూనిటీ హాళ్లు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

త్వరలో రిసాలబజార్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం పూర్తి

కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని పలు వార్డులు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. బోర్డు నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో ముందడుగు వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిదో వార్డులో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధానంగా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఆయా బస్తీల్లో మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తుండడంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదో వార్డు బొల్లారం ప్రాంతంపై కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న ప్రత్యేక దృష్టి సారించి తన కోటా నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి పనుల్లో వేగం పెంచేలా కృషి చేస్తున్నారు. స్థానిక బోర్డు సభ్యుడు లోక్‌నాథం బస్తీల సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బోర్డు అధికారులతో పాటు, స్థానిక ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకెళ్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే వార్డుకు సుమారు రూ. 2కోట్ల నిధులను ఎమ్మెల్యే సాయన్న కేటాయించడం జరిగింది. దీంతో తాగునీటి నూతన పైపులైన్లు, భూగర్భ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు జోరందుకున్నాయి. అదే విధంగా త్వరలో బోర్డు నుంచి వార్డుకు రూ. కోటి చొప్పున విడుదల అవుతున్న క్రమంలో పెండింగ్‌లో ఉన్న పనులపై బోర్డు సభ్యుడు లోక్‌నాథం దృష్టి కేంద్రీకరించారు. 

అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు 

ఎనిమిదో వార్డుకు సంబంధించి ఐదేండ్లలో పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి సుమారు రూ. 2కోట్లను ఎమ్మెల్యే సాయన్న కేటాయించారు. ఇందులో భాగంగా రిసాల బజార్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ. 30లక్షలు, ఆదర్శనగర్‌లో కమ్యూనిటీ హాల్‌ మొదటి అంతసస్తుకు రూ. 10లక్షలు, గంగపుత్ర సంఘం బస్తీలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ. 20 లక్షలు, డౌటన్‌ బజార్‌లో అంబేద్కర్‌ యువజన సంఘం భవనానికి రూ. 10లక్షల చొప్పున కేటాయించడం జరిగింది. దీంతో ఆయా కమ్యూనిటీ హళ్ల నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తోటి సంఘ భవనానికి రూ. 15లక్షలు, బంజార విలేజ్‌ కాలనీ అభివృద్ధికి రూ. 10లక్షలతో జరుగుతున్న పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరోవైపు పలు బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా బోర్డు సభ్యుడు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. 

రూ. 26లక్షలతో నూతన తాగునీటి పైపులైనన్లు

తాగునీటి నూతన పైపులైన్‌ల నిర్మాణంతో వార్డులోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రధానంగా పైపులైన్‌లు శిథిలావస్థకు చేరడంతో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమస్య తీవ్రతను గుర్తించిన బోర్డు సభ్యుడు లోక్‌నాథం ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకుపోవడంతో నిధులు కేటాయించి నూతన పైపులైన్ల నిర్మాణానికి చొరవ చూపారు. దీంతో తాగునీటి పైపులైన్‌లను క్యావలెరీ బ్యారెక్స్‌ బస్తీకి రూ. 5లక్షలు, అమ్ముగూడకు రూ. 8లక్షలు, మందాబాద్‌కు రూ. 8లక్షలు, సరస్వతి కాలనీకి రూ. 5లక్షల చొప్పున ఎమ్మెల్యే సాయన్న నిధులతో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 

అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

కంటోన్మెంట్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. బస్తీల్లో ఇప్పటికే కమ్యూనిటీ హళ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తికావోచ్చాయి. అదే విధంగా తాగునీటి సమస్య లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగింది. భూగర్భ డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారాలు చూపుతూ ఆయా వార్డుల్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం. బోర్డు సభ్యులు ఐక్యంగా ఉంటూ వార్డుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరింత పాటుపడుతామని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల ప్రత్యేక దృష్టితో మరిన్ని నిధులు సాధించి అభివృద్ధి పథంలో దూసుకుపోతాం. 

- జ్ఞాని సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్‌

వార్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 

వార్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. త్వరలో వార్డుకు రూ. కోటి చొప్పున నిధులు విడుదల అవుతున్న నేపథ్యంలో పెండింగ్‌ల పనులకు మోక్షం కలగనుంది. ఇప్పటికే బస్తీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి పైపులైన్ల నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదల దరికి చేరుస్తున్నాం. బోర్డు నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి పనుల్లో వేగం పెంచామని, స్థానిక ఎమ్మెల్యే సాయన్న చొరవతో వార్డు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. 

- లోక్‌నాథం, ఎనిమిదో వార్డు బోర్డు సభ్యుడు, కంటోన్మెంట్‌