సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్తీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బస్తీ స్థాయి నుంచే పారిశుద్ధ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేసేలా బస్తీ కార్యాచరణను ప్రారంభించారు. ప్రతి రోజు చెత్త సేకరణ 100 శాతం జరిగేలా చూసేలా ఉన్నతాధికారులకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ వెళ్లి వంద శాతం చెత్త సేకరణ చేసే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బస్తీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఇందులో వారం రోజుల్లో వివిధ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
మొదటి రోజు బస్తీ మీటింగ్, రెండో రోజు సాట్ వాహనాలకు అనుసంధానం చేయని ఇళ్లను గుర్తించడం, మూడవ రోజు బస్తీల్లో ర్యాలీలు నిర్వహించడం, 4వ రోజు చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, 5వ రోజు గుర్తించిన ప్రాంతాల్లో ముగ్గులు వేయడం, 6వ రోజు టౌన్ వెండింగ్ కమిటీ మీటింగ్, 7వ రోజు ముగింపు సందర్భంగా అధికారులు, పారిశుద్ధ్య విభాగం సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించేలా కార్యాచరణను రూపొందించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 శాతం ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేసి, రోడ్లపై ఎక్కడ చెత్తాచేదారం వేసేందుకు అవకాశం లేకుండా చేయడమే లక్ష్యంగా దీన్ని నిర్వహించనున్నారు. ఇందులో శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో మొదటి రోజు 1604 ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇందులో స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు చెత్త సేకరించే ఆటోల డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.