బొల్లారం, మే 14 : జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజు నుండి స్కూల్ బస్సుల ఫిట్నెస్ తనిఖీ చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తిరుమలగిరి రవాణా శాఖ అధికారి ఎర్రి స్వామి అన్నారు. మంగళవారం బోయిన్పల్లి పల్లవి మోడల్ స్కూల్లో పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లతో ఆర్టీఏ హైదరాబాద్ నార్త్ జోన్ ఆధ్వర్యములో వాహనాల ఫిట్నెస్పై సమావేశం నిర్వచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల జూన్ 12న పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో యాజమాన్యాలు తమ బస్సులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తేలితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు, యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జై చందర్, నరసింహ స్వామి, ఆర్టీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.