మూసాపేట, జనవరి 28: సోషల్ మీడియా వేదికగా ఫేక్ వీడియోలు పెట్టి విష ప్రచారం చేస్తూ సీఎం కేసీఆర్ గౌరవానికి భంగం కలిగిస్తున్న తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఐటీ సెల్ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు శనివారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు, వ్యక్తిగత దూషణలతో కూడిన కంటెంట్‌తో ఉన్న 18 ఫేస్బుక్ పేజీలను ప్రధానంగా గుర్తించినట్లు తెలిపారు. అందులో బీజేపీకి సంబంధించినవి 15, కాంగ్రెస్‌కు సంబంధించినవి 3, 24 ట్విట్టర్, 4 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయన్నారు.
వీటికి సంబంధించిన స్క్రీన్ షార్టులతో సహా అన్ని ఆధారాలతో ప్రొఫైల్ లింక్స్, ఫేస్బుక్ పోస్టులతో కూడిన 24 పేజీల ఫిర్యాదును పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా కన్వినిటీ స్టాండింగ్లను ఉల్లంఘిస్తున్న కంటెంట్ కావడంతో సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు. అదేవిధంగా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న అకౌంట్ నిర్వాహకులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఇదే తరహా వ్యూహాన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగిన కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో బీజేపీ పార్టీ అమలు చేసిందన్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే బీజేపీ ఆయా రాష్ర్టాల్లో నామ రూపాలు లేకుండా పోయిందన్నారు. గత ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం మీద చర్చకు వచ్చే పరిస్థితి లేక.. తెలంగాణలో కూడా బీజేపీ అదే తరహా వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.