ఉస్మానియా యూనివర్సిటీ: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని చోరీకి గురైన సొత్తును రికవరీ చేశారు. వారసిగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డిసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు.
ఈ నెల 2న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పార్సిగుట్టలో మహిళా ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి ఉన్న టులెట్ బోర్డును చూసి ఇద్దరు యువకులు ఆరా తీశారు.
అనంతరం మహిళ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న పుస్తెలతాడును లాక్కున్నారు. దానితోపాటు అల్మారాలోని చెవి కమ్మలు, ఉంగరాలు, ముత్యాల గొలుసు, మొబైల్ ఫోన్ లను తీసుకుని అక్కడి నుంచి పారిపోయ్యారు.
బాధితురాలు ఫిర్యాదుతో వారసిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముషీరాబాద్ వాసవి ఆర్యవైశ్య హాస్టల్లో ఉంటున్న యేలగిరి శ్రీకాంత్ (26), బన్సీలాల్ పేట్ లో ఉంటున్న ఈశ్వర్ (19) లను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును రికవరీ చేశారు. వారి సమాచారం మేరకు నిందితులకు సహకరించిన పార్సిగుట్ట సంజీవపురం కు చెందిన ఆళ్ల జ్యోతి (45)ను అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు.