దుండిగల్, డిసెంబర్8: నిర్మానుష్య ప్రాంతాల్లో కలుసుకునే జంటలతో పాటు ఒంటరిగా వెళ్లే వ్యక్తులను టార్గెట్ చేసి, కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న పేరు మోసిన దొంగల ముఠాను దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కూకట్పల్లి ఎల్లమ్మబండకు చెందిన తిల్పితీయ గురుధర్సింగ్ అలియాస్ గురుసింగ్(24), ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ నాగుల్‌మీరా అలియాస్ గోరే(30), ఏపీలోని నర్సారావుపేట పరిధిలోని అచ్చంపేట మండలానికి చెందిన కోట అఖిల్‌కుమార్(23) పాత నేరస్థులు. వీరంతా తాము వేర్వేరుగా చేసిన నేరాలకు గాను జైలు జీవితం అనుభవించిన సమయంలో స్నేహితులుగా మారి జట్టుకట్టారు.
జైలు నుండి బయటకు వచ్చిన అనంతరం ముఠాగా మారి గత నాలుగేండ్లుగా దోపీడీలకు పాల్పడుతున్నారు. నిర్జన ప్రదేశంలో కలుసుకునే జంటలను, ఒంటరిగా వెళ్లే మహిళలు, వృద్ధులను అటకాయించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలా కూకట్పల్లి పీఎస్ పరిధిలో 3, అల్లాపూర్ పీఎస్ పరిధిలో 2, దుండిగల్ పీఎస్ పరిధిలో 5, కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో 3, మాదాపూర్, బాచుపల్లి, మియాపూర్ పీఎస్‌ల పరిధిలో ఒక్కొక్కటి మొత్తం 16 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇవే కాకుండా జీడిమెట్ల, బాలానగర్, మహంకాళి, పంజాగుట్ట, కీసర, ఘట్కేసర్, దొనకొండ, కొత్తపేట్, లాలపేట్, పట్టాభిపురం పీఎస్‌ల్లో పాతకేసుల్లో నిందితులుగా ఉన్నారు.
పలు దోపీడీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న మోస్ట్‌వాంటెడ్ నేరస్థులైన గురుసింగ్, గోరే, అఖిల్కుమార్లు దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుండిగల్ రోటరీ-1, మహావిద్యాపీఠం సమీపంలో గతనెల (నవంబర్) 8వ తేదీన, అదే విధంగా 19వ తేదీన సాయంత్రం వేళల్లో కారు పార్కింగ్ చేసుకుని సేద తీరుతున్న డ్రైవర్లను కత్తులతో బెదిరించి వారి మెడల్లో ఉన్న బంగారు గొలుసులను బలవంతంగా అపహరించారు. దీంతో బాధితులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు దుండిగల్ రోటరీ-1 వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గురుసింగ్, గోరే, అఖిల్‌కుమార్ దుండిగల్ రోటరీ-1 వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సున్నిత ప్రాంతాల్లో దారిదోపీడీలకు పాల్పడుతున్నది తామెనని అంగీకరించారు. దీంతో నిందితుల నుండి రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.