బంజారాహిల్స్,జూలై 4: జార్జియాలో ఉద్యోగంతో పేరుతో నిరుద్యోగుల వద్దనుంచి డబ్బులు వసూలు చేసి విదేశాలకు చెక్కేసే ప్రయత్నంలో ఉన్న ఓ నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట సమీపంలోని ద్వారకా నగర్ కాలనీలో దొడ్డపల్లి శ్రీనాథ్ అనే వ్యక్తి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర క్రితం జువ్వల జార్జి మల్హర్ బాబు అనే వ్యక్తి నుంచి జార్జియాలో ఉద్యోగం పేరుతో రూ.5లక్షలు వసూలు చేశారు. కాగా ట్రావెల్ వీసాతో జార్జియాకు వెళ్లిన జువ్వల జార్జికి అక్కడ ఉద్యోగం లేదన్న విషయం తెలిసింది.
దీంతో తనను మోసం చేసిన శ్రీనాథ్ మీద చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది మార్చిలో ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పటినుంచి నిందితుడు పరారీలో ఉండడంతో ఇటీవల ఎల్వోసీ జారీ చేశారు. కాగా శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లే విమానంలో లండన్ వెళ్లేందుకు ప్రయత్నించిన శ్రీనాథ్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపారు. ఎల్వోసీ పెండింగ్‌లో ఉండడంతో అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు డిల్లీ పోలీసులు ఫిలింనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన అక్కడకు వెళ్లారు. నిందితుడు శ్రీనాథ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని నగరానికి తీసుకువస్తున్నారు.