సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): మనీ లాండరింగ్ పేరుతో 66ఏళ్ళ వయస్సుగల ఒక రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.28.68లక్షలు దోచుకున్న ఐదుగురిని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, 5 బ్యాంక్ పాసుపుస్తకాలు, 3చెక్‌బుక్కులు, 7డెబిట్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
డీసీపీ శ్రీబాల కథనం ప్రకారం… ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగినికి గుర్తుతెలియని దుండగులు ఫోన్‌చేసి ‘మీ ఆధార్‌కార్డుపై ముంబాయిలోని ఎస్బీఐ బ్యాంకులో ఖాతా తెరిచారు, మనీలాండరింగ్‌కు పాల్పడిన వివేక్ దాస్ అనే వ్యక్తికి సంబంధించిన కేసులో మీ ఖాతా వివరాలు బయటపడ్డాయి, మీ ఖాతా ద్వారా రూ.3కోట్ల లావాదేవీలు జరిగాయి’ అంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. కేసు విచారణకు సహకరించకపోతే 3నుంచి 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చని హెచ్చరించాడు. ఈ క్రమంలో పలు విధాలుగా బాధితురాలిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేయడంతో గత్యంతరం లేక బాధితురాలు రూ.28.68లక్షలను దుండగులు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది.
తీరా తేరుకున్న తరువాత మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన సైబర్‌క్రైమ్ పోలీసులు కేరళ నుంచి డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి, లక్షల రూపాయలు దోచుకుంటున్న హమ్జా, ముస్తఫ, హెన్సిలి జోసెఫ్, వి.పి.మణికండన్, అశిఫ్అలీలను కేరళాలో అరెస్టు చేశారు. కాగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బాబు కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని సైబర్‌క్రైమ్ డీసీపీ శ్రీబాల తెలిపారు.