మేడ్చల్ రూరల్, జూన్ 23: జిల్లాలో పని చేస్తున్న అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు అందజేయాలని అక్రెడిటేషన్ కమిటీ తీర్మానించింది. గురువారం కలెక్టరేట్లోని జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ పలు తీర్మానాలు చేసింది.
2022-24 వరకు కొత్త అక్రెడిటేషన్ కోసం జర్నలిస్టులు ఆన్లైన్లో చేస్తుకున్న దరఖాస్తులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా 851 దరఖాస్తులు రాగా, అర్హులకు కార్డులను జారీ చేయాలని కమిటీ ఆమోదించింది. వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సాధ్యమైనంత త్వరగా పరిశీలించి, అర్హత కల్గిన వారికి కార్డులు జారీ చేయాలని తీర్మానించింది. కాగా అర్హులందరికి అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీపీఆర్వో కిరణ్కుమార్, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.