బంజారాహిల్స్, డిసెంబర్ 29: మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ యాక్సిడెంట్ చేయడంతోపాటు పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన యువజంటపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన తీగుళ్ల దయాసాయి రాజ్( 28), స్నేహితురాలితో కలిసి కారులో శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో పార్టీకి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత పార్టీ ముగించుకుని జూబ్లీహిల్స్ మీదుగా ఇంటికి బయలుదేరారు.
జూబ్లీహిల్స్ రోడ్ నం.1లోని నందమూరి బాలకృష్ణ ఇంటి సమీపంలోకి రాగానే అతివేగంగా ఉన్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి కారు గాల్లోకి ఎగిరి రోడ్డుకు రెండోవైపు పడిపోయింది. ఈ ఘటనలో కారు తుక్కుతుక్కయింది. కాగా.. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని వారిని పీఎస్‌కు తీసుకువెళ్లారు. పీఎస్‌కు తీసుకువెళ్తున్న పోలీసులపై వారు బూతులు తిట్టడంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.