దశాబ్దాల పాటు కరువు ఏలిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు అమలు చేస్తున్నదని దాన్ని 16వేలకు పెంచి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా పేదలందరికీ సన్నబియ్యం ఇచ్చి తీరుతామని చెప్పారు. అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో గురువారం ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు.
అప్పులు చెల్లించకపోతే బ్యాంకు వాళ్లు వచ్చి మెడమీద కత్తిపెట్టేవాళ్లు. అంతే తప్ప వాళ్లెన్నడూ రైతుల గురించి ఆలోచించలేదు. గ్రామాలన్నీ ధాన్యపు రాశులతో నిండాలనే ఆలోచనతో రైతు బంధు అమలు చేశాం. అలాగే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని ప్రభుత్వాలు దళితులను ఓటుబ్యాంకులుగా చూశాయే తప్ప వాళ్ల అసలైన అభివృద్ధి కోసం పాటు పడింది లేదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు అమలవుతున్నది.
పొరపాటున..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, దళిత బంధు రెండూ బంద్ పెడ్తరు. పేదలకు సన్నబియ్యం ఇచ్చి తీరుతం. కర్ణాటకలో కరెంటు కావాలని రైతులు అక్కడ ధర్నాలు చేస్తున్నరు. ఇప్పుడు మనం తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇచ్చుకుంటున్నం. కాంగ్రెసోళ్లు వస్తే.. మళ్లీ చీకటి రోజులే’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజు, వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.