అతడి పేరు ప్రతాప్. డ్రైవింగ్ టెస్ట్ కోసం సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించి ఉప్పల్ ట్రాక్‌ను ఎంపిక చేసుకున్నాడు. సోమవారం అతడు ఉప్పల్ ట్రాక్‌పై డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలి. దీంతో అతడు ఒక్కరోజు ఆఫీస్‌కు సెలవు పెట్టి స్లాట్ సమయానికి కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ అధికారులను సంప్రదించగా సారథి సేవలు ఇక్కడ అందవు అంటూ చెప్పడంతో ఖంగుతినడం అతడి వంతైంది. మీరు ఉప్పల్ స్లాట్ రద్దు చేసుకోని వేరే స్లాట్ బుక్ చేసుకోండని అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక వెనక్కి వెళ్లిపోయాడు.
RTA Slots | సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): రవాణా శాఖ అధికారులకు రావాల్సిన ఓటీపీలు.. ఏసీబీ అధికారులకు వెళ్తున్నాయి. ఇదేంటీ అనుకుంటున్నారా? ఔను ఇటీవల ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపి అక్కడి అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు.. అసలే రవాణా శాఖ సారథి పోర్టల్ సేవల్లో ప్రతీ అరగంటకోసారి సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతుంటే.. మరోవైపు ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం రవాణా శాఖ అధికారుల ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో సారథి పోర్టల్ ఓపెన్ చేయడానికి కూడా వీలు లేకుండాపోయింది. ఆర్టీఏకు రావాల్సిన ఓటీపీలు ఏసీబీ వారికి వెళ్తుండటంతో సారథి పోర్టల్ వెబ్సైట్ లాగిన్ కావట్లేదని అధికారులు తెలిపారు. ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయ ఇన్చార్జి ఆర్టీవో, ఎంవీఐల ఫోన్లు స్వాధీనం స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడి కార్యాలయంలో సారథి సేవలు నిలిచిపోయాయి.
తెలంగాణలో సారథి పోర్టల్ ప్రథమంగా సికింద్రాబాద్‌లో ప్రారంభమైంది. పైలెట్ ప్రాజెక్టుగా సికింద్రాబాద్‌ను కేటాయించారు. అయితే సికింద్రాబాద్ పరిధిలో వాహన సేవలు వినియోగించుకోవాల్సిన వాళ్లు సారథి పోర్టల్‌ను ఆశ్రయించాల్సిందే. దీంతో స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత తేదీలో సంబంధిత స్లాట్ కేటాయించిన కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంటుంది. అందులో భాగంగా డ్రైవింగ్ టెస్ట్ కోసం ఉప్పల్ కార్యాలయాన్ని ఎంపిక చేసుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. “సారథి పోర్టల్‌లో లాగిన్ అవ్వాలంటే సంబంధిత అధికారులకు ఓటీపీ వస్తుంది… ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే పోర్టల్‌లో లాగిన్ అయి సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ మా మొబైల్స్ ఏసీబీ వాళ్ల వద్ద ఉన్నాయి. ఓటీపీలు వాళ్లకు వెళ్తాయి” అంటూ అధికారులు తెలిపారు.