Digital Arrest | సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): సైబర్‌నేరగాళ్లు రూట్ మార్చారు.. సీబీఐ అధికారులమంటూ ఇప్పటివరకు సాధారణ ప్రజలను మోసం చేసిన మోసగాళ్లు..ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. ఏసీబీ అధికారులమంటూ కొత్తగా అవతారమెత్తి తహసీల్దార్లను డిజిటల్ అరెస్టు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో పనిచేసే ఒక తహసీల్దార్‌కు సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేశారు. తామ ఏసీబీ నుంచి మాట్లాడుతున్నామంటూ చెప్పారు.
అదే కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి ఏసీబీకి దొరికిపోయాడు, అయితే అతడు తీసుకున్న లంచంలో మీ పాత్ర కూడా ఉందని మీపై కూడా కేసు నమోదు చేస్తున్నామంటూ బెదిరించారు. ముందుగా సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేసి మరో నంబర్ నుంచి మాట్లాడాలని చెప్పారు. వెంటనే సదరు తహసీల్దార్ తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్‌తో సైబర్ నేరగాళ్లకు ఫోన్ చేశాడు, లంచం వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ బతిమాలాడు.
దీంతో… కేసు నమోదు కాకుండా ఉండాలంటే ఫలాన ఖాతాకు డబ్బు పంపించండంటూ నేరస్తులు సూచించారు. ఆ ఎమ్మార్వో తన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు, తన భార్య, తన కొడుకు అతని స్నేహితుల వద్ద నుంచి దఫ దఫాలుగా రూ. 3.3 లక్షలు పంపించారు. ఆ తరువాత ఇదంతా మోసమని గుర్తించి వెంటనే రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.