సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. నిర్ణీత సమయాల్లో జరగాల్సిన వాహనదారుల పనులను వాయిదా వేస్తూ డబ్బులిస్తున్న వారికి అధికారులు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులు అడ్డావేసి వారి కేంద్రంగానే పనులు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణాల చేతనే ఏసీబీ అధికారులు నగరంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి, మణికొండ, ఇబ్రహీంపట్నం తదితర కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు రెండో రోజు కూడా పలు ఫైళ్లను పరిశీలించారు. కొందరు ఏజెంట్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న పైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రవాణా శాఖ అధికారులు వారి వారి కార్యాలయాల్లో కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకుని పనులు చక్కబెడుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.
ఇక లైసెన్స్ ఇప్పించాలన్నా.. ఆర్సీ కార్డు త్వరితగతిన ఇంటికి రావాలన్నా, డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలన్నా, ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నా ఇలా ఏ సైవకైనా ఓ రేటు దళారులు నిర్ణయిస్తారు. ఆ డబ్బులు ముట్టజెప్పితే ఆ పని బాధ్యతను తీసుకుంటారు. ఆ ఫైళ్లపై ఓ సీక్రెట్ కోడ్ రాసి అధికారుల వద్దకు పంపిస్తారు. అలా వచ్చిన ఫైళ్లను అధికారులు ఇతరాత్ర అంశాల జోలికిపోకుండా పని ముగిస్తారు. అలా కోడ్ ఆధారంగా దళారులు కొందరు అధికారులు కుమ్మక్కై పనులు చక్కబెడుతునట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి పనికైనా దళారులను ఆశ్రయిస్తే సరిపోతుందనే భావన వాహనదారుల్లో ఉంది. నేరుగా కార్యాలయాలకు వెళితే నిబంధనల ప్రకారం అన్ని పాటించినా.. సేవలు మాత్రం నెల రోజులు గడిచినా అందని దుస్థితి నెలకొంది. మహేశ్ అనే వ్యక్తి తన లైసెన్స్ రెన్యువల్‌కు ఇబ్రహీంపట్నం ఆర్టీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ నెల రోజులు గడిచినా.. లైసెన్స్ చేరలేదు. దీనిపై ఆరా తీసినా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో చేసేదేమీలేక ఓ దళారికి రూ. 500 అందించి ఆ కార్డును అదే రోజు పొందడం విశేషం.
గ్రేటర్లో 12 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క రోజుకు రిజిస్ట్రేషన్ల కోసం ఒక్క కార్యాలయానికి 80 నుంచి 200 వరకు వాహనాలు వస్తుంటాయి. వీటికి సంబంధించిన స్మార్ట్ కార్డులన్నీ 7-10 రోజుల్లోపు ఇంటికి చేరాల్సి ఉంటుంది. కానీ అది జరగడం లేదు. వాహనదారులు ప్రతీ రోజు కార్యాలయాల చుట్టూ తమ కార్డుల కోసం తిరుగుతున్నారు. కొందరు ఏజెంట్లను సంప్రదించి వారు అడిగినంత ముట్టజెప్పి కార్డులను తీసుకుంటున్నారు. దళారుల చర్యలకు బ్రేకులు వేయాల్సిన కొందరు అధికారులు సైతం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాల్లో సేవలు పారదర్శకంగా అందకపోవడంతో వాహనదారులు ఇటీవల ఏజెంట్లను ఆశ్రయించడం పెరిగింది. కార్యాలయ పనివేళల్లో ఏజెంట్లు నేరుగా కార్యాలయాల్లోకి వెళ్లి ఫైళ్లు సిబ్బంది ముందు పెట్టి పనులు చేయించుకుంటున్న ఉదంతాలు ఉన్నాయి. కొన్ని చోట్ల దళారులే ప్రత్యామ్నాయ ఆర్టీఓలుగా వ్యవహరిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సేవలు సకాలంలో అందాలన్నా.. కార్డులు వెంటనే పొందాలన్నా వాళ్లు నిశ్చయించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. హర్ష అనే వ్యక్తి రంగారెడ్డి మణికొండ కార్యాలయంలో తన వాహనం రిజిస్ట్రేషన్ చేసుకొని రెండు నెలలకు పైగా అయింది. ఇప్పటికీ అతడికి ఆర్సీ ఇంటికి చేరలేదు. ఈ విషయంపై ఆరా తీయగా అధికారులు కార్డు ప్రాసెస్‌లో ఉందని బుకాయించారు. కానీ ఏజెంట్లను ఆశ్రయించడంతో వాళ్లడిగిన డబ్బులు ముట్టజెప్పి ఆ మరుసటి రోజే కార్డు పొందాడు. ఓ వైపు అధికారులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఉన్నా.. ఏజెంట్లు అదే కార్యాలయంలో మరో వైపు ప్రత్యామ్నాయ వేదికలు ఏర్పాటు చేసుకొని వాహనదారుల పనులు చక్కబెడుతున్నారు.
లెర్నింగ్ లైసెన్స్ పొందాలన్నా.. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ అందుకోవాలన్నా రూ.వె య్యి వరకు దళారికి ముట్టజెప్పాల్సిన దుస్థితి నెలకొంది. డబ్బులివ్వకుండా వెళితే ఆ వ్యక్తులు పరీక్ష ఉత్తీర్ణత పొందడం కష్టమే. కానీ ముందుగానే దళారిని ఆశ్రయిస్తే వాళ్లు ఆ స్లాట్ఫాంపై తమ వారే అని ఓ కోడ్ సూచిస్తారు. దానిని చూసి అధికారులు వెంటనే ఉత్తీర్ణత అయ్యేలా చేసి లెర్నింగ్ సర్టిఫికెట్ చేతులో పెడుతారు. ఇక డ్రైవింగ్ సమయంలోనూ వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దళారులే చూసుకుంటారు.
ఇటీవల ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఏఐ కెమెరాలు అమర్చిన విషయం తెలిసిందే. వీటితో దళారుల ఆగడాలకు చెక్ పెట్టొచ్చని ఆర్టీఏ ఉన్నతాధికారులు భావించారు. అందులో భాగంగా మూడు ఏఐ కెమెరాలను అమర్చారు. ఒక వ్యక్తి పదే పదే వార్డులకు తిరుగుతున్నా.. అదే వ్యక్తి మరుసటి రోజు వచ్చినా.. ఎన్ని సార్లు వచ్చాడు అనే విషయాలను ఏఐ కెమెరాలు సమాచారమిస్తాయి. ఇలాంటి కెమెరాలను గ్రేటర్‌లోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏఐ కెమెరాల నిర్వహణ నెలకు లక్షల రూపాయల ఖర్చుతో ముడిపడి ఉంటుందని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో స్లాట్ ఎవరికైతే బుక్ అయిందో వారినే లోపలికి అనుమతించేవారు. ఇలాంటి పద్ధతి కొనసాగితే దళారులకు అడ్డుకట్ట వేయొచ్చని పలువురు ఆర్టీఏ అధికారులు తెలిపారు. చెబుతున్నారు.