OU | ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 2: ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని, సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆందోళన పోలీసులకు విద్యార్థులకు మధ్య బాహాబాహీకి దారితీసింది. వర్సిటీలపై వివక్షకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. అనంతరం, దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీల పదవీ కాలం ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు వీసీలను నియమించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇన్చార్జి వీసీలతో కాలయాపన చేస్తూ వర్సిటీల మనుగడకే ముప్పు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని వర్సిటీలకు మహర్దశ తీసుకువస్తామని అన్నట్టు గుర్తు చేశారు. కానీ, ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటి వరకు వర్సిటీల సంక్షేమం గురించి మాట్లాడిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడంతో విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు.
వర్సిటీలలో ఖాళీగా ఉన్న 82 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమవుతున్న వర్సిటీ భూములను కాపాడాలని కోరారు. అశాస్త్రీయంగా పెంచిన పీజీ, ఇంజినీరింగ్, పీహెచ్డీ ట్యూషన్, ఎగ్జామ్ ఫీజులను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి మెరుగైన హాస్టల్ వసతి కల్పించాలన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, విద్యానగర్ విభాగ్ కన్వీనర్ పృథ్వీతేజ, స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీహరి, కమల్ సురేశ్, నాయకులు సుమన్ శంకర్, రాజు పాల్గొన్నారు.