సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : తప్పులకు తావు లేకుండా ఓటరు జాబితా తయారీకి ఆర్ఓలు, ఈఆర్ఓలు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్ఓ, ఈఆర్ఓలతో సోమవారం జాయింట్ సీఈఓ సర్పరాజ్ అహ్మద్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ 100శాతం పెరిగేలా నగర వ్యాప్తంగా పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడానికి బీఎల్ఓలు, ఈఆర్ఓ, ఆర్ఓలు చర్యలు తీసుకోవాలని రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. ఓటరు జాబితాలో కొత్త ఓటరు నమోదు, డెత్, షిఫ్టింగ్‌లను ఫారం-6, ఫారం-7, ఫారం-8ల ద్వారా చేపట్టాలని, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సహకరించాలని తెలిపారు. ప్రతి కాలనీ, గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్రత్యేకమైన రోజును ఓటు నమోదుకు కేటాయించి బీఎల్ఓలు ఆయా కాలనీలలో నేరుగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసి సంబంధిత రిసిఫ్ట్, రిఫరెన్స్‌ను దరఖాస్తుదారులకు అందజేస్తారని తెలిపారు. ఓటరు నమోదుకు తప్పనిసరిగా మొబైల్, ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలింగ్ స్టేషన్ వారీగా ఇంటినంబర్లు డ్రాఫ్ట్‌ను ప్రచురణ చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు.
టోల్ ఫ్రీ నంబర్ 1950
ఓటర్లు, ఓటర్ హెల్ప్‌లైన్, సీఈఓ వెబ్సైట్, ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నంబరు 1950 ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ఫైనల్ ఓటరు జాబితాను ప్రతి పోలింగ్ స్టేషన్లో బీఎల్ఓ వద్ద, వార్డు ఆఫీసులో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఓటరు తమ పేరును ఓటరు జాబితాలో ఉండి, భారత ప్రభుత్వం సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి కలిగి ఉండాలని చెప్పారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డును నేరుగా ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ప్రత్యేకంగా క్యాంపెయిన్లతో పాటు రద్దీ ఉన్న ప్రదేశాలు, బస్ బేలు, రైల్వే స్టేషన్లలో, ప్రార్థన స్థలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితా
పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను రూపొందించి ఓటర్లకు అందించాలని జాయింట్ సీఈఓ సర్పరాజ్ తెలిపారు. ఓటరు జాబితాలో సాధారణంగా జరుగుతున్న ఏడు తప్పిదాలను ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు నివాసముంటున్న పోలింగ్ బూత్ పరిధిలోనే తన ఓటును సరిచేయడం, లింగ మార్పు, అడ్రస్ వంటి తప్పిదాల మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈఆర్ఓలు నిర్ణీత తేదీ, సమయాలలో నగర వ్యాప్తంగా ఉన్న కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో ఓటరు నమోదుకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా చర్యలు తీసుకోవాలని సర్పరాజ్ తెలిపారు. ఇందుకు బ్యానర్లు, మొబైల్ వ్యాన్లు, స్వచ్ఛ ఆటోల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ ఆర్ఓ, ఎన్నికల అధికారి శంకరయ్య, జాయింట్ కమిషనర్ మంగతాయారు, ఆర్ఓ, ఈఆర్ఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.