Suicide | మారేడ్‌పల్లి, ఏప్రిల్ 5 : క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుచిత్రలోని బిహెచ్ఈఎల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న రాజ్వీర్ సింగ్ ఠాకూర్ (25) ప్రైవేటు ఉద్యోగి. తనకు వచ్చే జీతం మొత్తం తన సొంత అవసరాలకు వాడుకోవడంతో పాటు ఇతరుల వద్ద అప్పులు చేశాడు.
మద్యానికి బానిసైన రాజ్వీర్ సింగ్ ఠాకూర్ చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది శనివారం ఉదయం తెల్లవారు జామున 1:40 గంటలకు తన నివాసం నుంచి బైక్ మీద వచ్చి తనకు తానుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.