వెంగళరావునగర్, ఫిబ్రవరి 12: కార్ డ్రైవింగ్ స్కూల్లో కామాంధుడు తిష్టవేశాడు. డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లిన యువతి ఫోన్ నెంబర్ సేకరించి ఫోన్లు చేస్తూ.. అసభ్యకరమైన మెసేజుల్ని పంపేవాడు. షీ టీమ్స్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేయగా.. కౌన్సిలింగ్ రమ్మంటూ కామాంధుడ్ని పిలిపించారు. కొంత కాలం తర్వాత మళ్ళీ ఫోన్ చేయసాగాడతను. షీ టీమ్స్ సలహాతో మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత ఆ యువతి.
పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన యువతి (28) చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసుకుని.. సీఏ కోర్సులు అభ్యసించేందుకు గతేడాది జులైలో నగరానికి వచ్చి వెంగళరావునగర్‌లోని ప్రైవేటు హాస్టల్లో నివాసం ఉంటుంది. కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు హాస్టల్ పక్కనే ఉన్న విజయ్ డ్రైవింగ్ స్కూల్లో 28 రోజుల కోర్సు లో చేరింది. ఆ డ్రైవింగ్ స్కూల్లో పనిచేసే జీవన్ అనే ఉద్యోగి ఆమె ఫోన్ నెంబర్ సేకరించాడు. యువతికి ఫోన్లు చేస్తూ అసభ్యకరమైన మెసేజుల్ని పంపేవాడు.
దాంతో ఆ యువతి డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులకు చెప్పడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అయినప్పటికీ వేర్వేరు నెంబర్లతో అసభ్యకరమైన మెసేజుల్ని పంపిస్తూ వేధింపులకు గురిచేశాడు. గత డిసెంబర్ నెలలో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్ కు రమ్మంటూ పోలీసుల నుంచి కామాంధుడికి పిలుపు రావడంతో పది రోజుల వరకు ఆమెకు ఫోన్ చేయలేదు. యువతికి మళ్లీ ఫోన్లు చేయడం.. మెసేజుల్ని పంపించాడు. అంతటితో ఆగక ఆమె ఉండే హాస్టల్ వద్దకు వచ్చి యువతిని వెంబడిస్తూ వేధింపులకు గురిచేశాడు షీ టీమ్స్ పోలీసుల సలహాతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.