బేగంపేట్ జూలై 4: ఓ వృద్ధుడు నడుపుతున్న కారు అదుపు తప్పి పలు వాహనాలకు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ యువతి తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రాంగోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మారేడుపల్లికి చెందిన గోపాల్ చంద్రబోస్ (86) శుక్రవారం తన ఇంటి నుంచి ఈశ్వరీబాయి విగ్రహం మీదుగా బేగంపేట వెళుతున్నారు. ఈశ్వరీబాయి విగ్రహం దాటగానే ఆయన నడుపుతున్న వెర్నా కారు అదుపు తప్పి ఓ ద్విచ వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో ఆ వాహనం నడుపుతున్న మల్కాజ్‌గిరికి చెందిన రింకు (22) అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ వృద్ధుడు మరింత భయంతో ముందుకు వెళ్లి మూడు ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటో, మరో ట్రాలీ ఆటోను కారుతో ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన యువతిని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు తరలించారు. మరో ముగ్గురికి స్పల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. రింకూకు బేగంపేటలో ఇంటర్వ్యూ ఉండటంతో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసికుని దర్యాప్తు ప్రారంభించారు.