ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 14: మత్తుపదార్థాలకు అలవాటు పడిన ఒక యువకుడు చివరికి సప్లయర్‌గా మారాడు. ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తిన అతడు గంజాయి సరఫరా చేస్తున్నాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. సికింద్రాబాద్‌లోని ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చందనాదీప్తి కేసు వివరాలను వెల్లడించారు. నేరేడ్మెట్ మధురానగర్‌లో నివాసముండే చుంచు నితీశ్చంద్ర (20) మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. జవహర్‌నగర్‌కు చెందిన రాహుల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశాడు. ఇటీవల డబ్బులకు ఇబ్బంది పడుతున్న నితీశ్చంద్ర ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో డెలివరీ బాయ్‌గా చేరాడు.
వచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపోకపోవడంతో మరో అవతారమెత్తాడు. ఫుడ్ డెలివరీ బాయ్ ముసుగులో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని సైప్లె చేయవచ్చునని నిర్ణయించుకున్నాడు. వెంటనే రాహుల్‌ను సంప్రదించి, గంజాయిని తాను కూడా కస్టమర్లకు అందజేస్తానని, అందుకు తనకు కమీషన్ ఇవ్వాలని ప్రతిపాదించాడు. రాహుల్ అంగీకరించడంతో గంజాయిని వినియోగదారులకు చేరవేస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా మత్తుపదార్థాలను చీతా, కలాఖాన్, స్వీట్‌బాక్స్ వంటి కోడ్స్‌తో పిలిచి, అవసరమైన వ్యక్తులకు అందజేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిఘా పెంచారు.
ఈ నెల 11న నితీశ్చంద్ర తన వెంట ఐదు గంజాయి ప్యాకెట్లు తీసుకొచ్చి, వాటిలో రెండింటిని కోడ్ ఉపయోగించి ఇద్దరు వ్యక్తులకు ఇచ్చాడు. ఆ తర్వాత తుకారాంగేట్‌కు వచ్చిన అతడు మిగిలిన వాటిని రాహుల్ చెప్పిన అడ్రస్‌లో ఇచ్చేందుకు వెళ్తుండగా తుకారాంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నితీశ్చంద్ర వద్ద నుంచి రూ.30 వేల విలువజేసే 600 గ్రాముల గంజాయి, ఒక బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నితీశ్చంద్ర నుంచి గంజాయి తీసుకుంటున్న 20 మందిని గుర్తించామని, మిగితా వారిని గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. గంజాయికి అలవాటు పడిన వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పారు. గంజాయి సేవించే కొత్త కొత్త విధానాలతో వీడియోలు రూపొందించి, యువతను ఈ రొంపిలోకి దింపుతున్నారని, రాహుల్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.