Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 8 : పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకోవడంతో పాటు సహజీవనం చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గాయత్రీహిల్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి(24) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంటుంది. రెండేళ్ల క్రితం అదే సంస్థలో ఉద్యోగంలో చేరిన కర్నూల్‌కు చెందిన బత్తుల సాకేత్‌రెడ్డి(26) అనే యువకుడితో స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్యన ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ ఒకే ఫ్లాట్‌లో నివాసం ఉండాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. పెళ్లి మాటెత్తిన ప్రతిసారి తన సోదరి పెళ్లయిన తర్వాత అంటూ వాయిదా వేసేవాడు.
కాగా గత కొంతకాలంగా మద్యం మత్తులో యువతిని తీవ్రంగా కొట్టడం, మత్తు దిగిన తర్వాత క్షమించాలంటూ కాళ్లు పట్టుకోవడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా ఏడాది క్రితం నుంచి ఇద్దరి మద్యన గొడవలు మరింతగా పెరిగాయి. ఉద్యోగానికి సరిగా వెళ్లకుండా ఇంట్లో ఉంటున్న సాకేత్రెడ్డిని నిలదీయడంతో చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అతడిని వెతుక్కుంటూ వెళ్లగా సంగారెడ్డిలో ఉన్నట్లు తేలింది. అక్కడికి వెళ్లి పెళ్లి గురించి ప్రశ్నించగా తాను సొంతూరికి వెళ్లి కుటుంబసభ్యులను ఒప్పించి వస్తానని, తర్వాత పెళ్లి చేసుకుందామంటూ చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత సాకేత్‌రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్ చేసి ముఖం చాటేశాడు. సొంతూర్లో అతడి కుటుంబసభ్యులకు కాల్ చేసినా తమకు సంబంధం లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో తనను పెళ్లిపేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేసిన సాకేత్‌రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని బాధితురాలు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీఎన్ఎస్ 69, 74,79 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.