సిటీబ్యూరో, మే3(నమస్తే తెలంగాణ): బతుకమ్మకుంటలో మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఈ స్థలవివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, హైకోర్టు ఉత్తర్వులను అమలుపరచాలంటూ సుప్రీం చెప్పినప్పటి నుంచి ఈ వివాదం మరింత జటిలంగా మారుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రెస్‌మీట్ పెట్టి బతుకమ్మకుంటపై చేసిన వ్యాఖ్యలను ఆ స్థలం తనదేనంటూ న్యాయపోరాటం చేస్తున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. భూవివాదం కోర్టులో ఉండగా ఒక ఐపీఎస్ అధికారి తన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ఎలా వ్యాఖ్యలు చేస్తారంటూ మండిపడ్డారు.
అసలు కోర్టు ఎక్కడా భూ యాజమాన్యంపై ఇప్పటివరకు తీర్పు చెప్పలేదని అయినా కమిషనర్ రంగనాథ్ మాత్రం దీనిని వ్యక్తిగతంగా తీసుకుని భూమిపై తనకు హక్కులే లేవంటూ వ్యాఖ్యానించడం సరైంది కాదని సుధాకర్‌రెడ్డి అన్నారు. తన భూ యాజమాన్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శనివారం రంగనాథ్ ప్రెస్‌మీట్ పెట్టి బతుకమ్మకుంటపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి. సుప్రీంలో కేసు ఉండడంతో పాటు హైకోర్టులో కేసు నడుస్తుండగానే భూమిపై రంగనాథ్ మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. ఇదిలా ఉంటే సుప్రీంలో తీర్పు వచ్చిన వెంటనే కాంగ్రెస్ నేత వీహెచ్ బతుకమ్మకుంట వద్ద ధర్నాచేసి కోర్టు తీర్పుపై మాట్లాడిన తీరు కూడా చర్చనీయాంశమైంది. బతుకమ్మకుంట కేవలం వీహెచ్ కళ్లల్లో ఆనందం చూడడంకోసం సీఎం రేవంత్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహకారంతో చేస్తున్న వ్యవహారం అంటూ ఎడ్ల సుధాకర్‌రెడ్డి మొదటినుంచి అంటున్నారు.
రంగనాథ్ వర్సెస్ సుధాకర్‌రెడ్డి..!
హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ చేపట్టిన చర్యలపై సుప్రీం సైతం ఆయన చర్యలను తప్పుపట్టింది. హైకోర్టు తాను ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ భూమి రూపురేఖలు మార్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ పత్రికా సమావేశం పెట్టి బతుకమ్మకుంట ముమ్మాటికీ చెరువేనని, ఇందుకు సంబంధించిన శాటిలైట్, గూగుల్ మ్యాప్స్‌తో చారిత్రక ఆధారాలను చూపిస్తున్నానని చెప్పడంపై సుధాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ల్యాండ్ నేచర్ అనేది రెవెన్యూ రికార్డులైనటు వంటి సేల్ డీడ్, సేత్వారీ, టీఎర్ఎల్ఆర్, పట్టా పాస్‌బుక్, విలేజ్ మ్యాప్ వంటి వాటి ద్వారా గుర్తించబడుతుందని వెల్లడించారు. దీని ప్రకారం వివాదాస్పద భూమి మెట్ట/ఖాళీ భూమి(వెకెంట్ ట్యాండ్) అని గుర్తించబడిందని చెప్పారు.
శాటిలైట్ మ్యాపులు ఆ నిర్దిష్ట సమయంలోని భూమి స్థితిని మాత్రమే చిత్రీకరిస్తాయని ఎడ్ల సుధాకర్‌రెడ్డి చెప్పారు. కోర్టు వివాదంలో ఉన్న 563/1లో 9.19ఎకరాల భూమిపై కోర్టు తీర్పు చెప్పకుండా తానే తీర్పు చెప్పడమేంటని ప్రశ్నించారు. తన యాజమాన్య హక్కులపై కూడా రంగనాథ్ చేసిన వ్యాఖ్యలకు సుధాకర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే బతుకమ్మ కుంట విషయంలో మొదటినుంచి వివాదం ఉన్నప్పటికీ హైకోర్టులో స్టేటస్ కో ఇచ్చిన తర్వాత భూమి రూపురేఖలు మారుస్తూ సుమారు 7.15కోట్లతో అభివృద్ధి పనులు అంటూ బతుకమ్మ చెరువు తవ్వించి పార్కుగా రూపొందించి డెవలప్ బై హైడ్రా అనే బోర్డులు పెట్టించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ వ్యవహారంపై కోర్టు ధిక్కరణ కింద సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు ఈ వ్యవహారాన్నీ పరిశీలించి తాము ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన పనులపై మండిపడుతూ భూమిని యథాతథస్థితికి తీసుకురావాలని చెప్పింది. రంగనాథ్ చెబుతున్నట్లు భూమి చుట్టు నిర్మించిన కాంక్రీట్ గోడను తొలగించకూడదని కోర్టు చెప్పిందనే అతని వాదనను కూడా పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. కాంక్రీట్ గోడకు బదులు ఫెన్సింగ్ నిర్మించినట్లు హైడ్రా కోర్టులో చెప్పిందని, ఇక్కడ ఎలాంటి ఫెన్సింగ్ లేదని సుధాకర్‌రెడ్డి తెలిపారు. వివాదాస్పద భూమి చుట్టు భారీ గ్రిల్స్‌తో కూడిన ఆర్సీసీ గోడలను నిర్మించిందని చెప్పారు.
అసలు కోర్టుకు చెప్తున్నదొకటి, బయట కనిపిస్తున్నదొకటి.. గ్రిల్స్ వేసి పెద్ద పెద్ద గోడలు కట్టినచోట కేవలం ఫెన్సింగ్ వేశామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాను 1986లో సేల్ అగ్రిమెంట్ చేసుకున్న ఒప్పందం అన్‌రిజిస్టర్డ్ అని, సుధాకర్‌రెడ్డికి ఈ భూమిపై హక్కులే లేవంటూ కమిషనర్ రంగనాథ్ ఆరోపించారు. అయితే చట్టప్రకారం 1994 కు ముందు అమ్మకపు ఒప్పందాన్ని తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని, అందుకే అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే పత్రమని సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. 1994 కు ముందు అమ్మకపు దస్తావేజు ఒప్పందపు పత్రాలకు ఎలాంటి రిజిస్టేషన్ అవసరం లేదనే విషయం గమనించాలని తెలిపారు. అలాగే తమ వద్ద పట్టా పాస్‌బుక్ లేదని హైడ్రా కమిషనర్ తప్పుగా పేర్కొన్నారని, వాస్తవానికి అదే పాస్ బుక్‌ను ట్రయల్ కోర్టు ముదు ఓఎస్ 15 ఆప్ 2025లోని ఐఏ 84 ఆఫ్ 2025లో ఎగ్జిబిట్‌గా గుర్తించడం జరిగిందని తెలిపారు.
కోర్టు ఆగ్రహంతో రాజకీయ మలుపులు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్రంగా మండిపడడంతో పాటు నెలరోజులలోపు బతుకమ్మకుంటపై కోర్టు ధిక్కరణ చర్యలు తొలగించాలంటూ ఆదేశించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన రంగనాథ్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. సుప్రీంలో తీర్పు వచ్చిన వెంటనే ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోర్టు తీర్పుపై మండిపడ్డారు. హజీపూర్ ఘటన జరిగి ఆరేళ్లయినా ఇప్పటివరకు తీర్పు రాలేదని, బతుకమ్మకుంట విషయంలో మాత్రం ఇంత త్వరగా తీర్పు రావడం చూస్తే ఆశ్చర్యంగా ఉందంటూ వ్యాఖ్యానించడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఈ విషయంలో అన్ని పార్టీలు కలిసి వచ్చి బతుకమ్మకుంట విషయంలో పోరాటం చేయాలంటున్న వీహెచ్ ఇంతగా పట్టుబట్టడానికి వేరే కారణముందంటూ చెప్పుకొంటున్నారు. తన అనుచరులైన కొందరు చేసిన భూదందాను కాపాడుకోవడానికే బతుకమ్మకుంటను తెరపైకి తెచ్చారంటూ బాగ్ అంబర్‌పేటలో చర్చ జరుగుతుండగా, బీఆర్ఎస్ నేత సుధాకర్‌రెడ్డితో ఉన్న వైరం కారణంగానే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి పార్టీల రాజకీయంగా మార్చేశారంటూ మరికొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో సాయం కోరుతూ సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకే బతుకమ్మకుంటను ఎన్ని అడ్డంకులు వచ్చినా కోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తూ కేవలం వీహెచ్ కళ్లల్లో ఆనందం చూడడం కోసమే సీఎం హైడ్రా కమిషనర్‌ను ఈ పనిచేసి పెట్టాలని చెప్పినట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఎవరి ప్రయోజనం ఎంత మేరకు ఉన్నా ప్రజాధనం మాత్రం నిష్ప్రయోజనంగా మారేందుకు హైడ్రా కమిషనర్ మొండితనమే కారణమంటూ స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కోర్టు తీర్పు వచ్చేవరకు ఆగే పరిస్థితి లేకుండా హడావిడిగా చెరువు తవ్వించి, హంగూఆర్భాటాలు కల్పించి హైకోర్టు స్టేటస్కో ఉండగానే సీఎంతో ప్రారంభోత్సవం చేయించాల్సినంత అవసరమేమొచ్చిందని, భూ యాజమాన్యంపై కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుండేదంటూ స్థానికంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం వివిధ కారణాలతో రాజకీయంగా మలుపులు తిరిగినప్పటికీ నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాజకీయనాయకుడిలా వ్యవహరిస్తున్నారంటూ పలువురు చర్చించుకుంటున్నారు.